భారత్‌లో పిక్సెల్ స్మార్ట్ఫోన్లను తయారుచేయాలని ప్రముఖ టెక్సంస్థ గూగుల్ కసరత్తు సాగిస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధానకార్యాలయంలో సెర్చింజిన్ దిగ్గజం మాతృసంస్ధ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌తో ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల భేటీ అయిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చైనా వెలుపల గూగుల్ తన ప్రొడక్షన్ పోర్ట్‌పోలియోను విస్తరించే క్రమంలో భారత్‌లో స్మార్ట్ ఫోన్ తయారీపై గూగుల్ ఆసక్తి కనబరుస్తోంది.
ఇక మరో టెక్ దిగ్గజం యాపిల్ సైతం 2025 నాటికి ప్రపంచ ఐఫోన్ తయారీలో 18 శాతం భారత్‌కు తరలించే లక్ష్యంతో కసరత్తు సాగిస్తోంది. భారత్‌లో స్మార్ట్ఫోన్ల తయారీ కోసం గూగుల్ ఇప్పటికే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ భారత విభాగం భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో పాటు లావా, డిక్సన్ టెక్నాలజీస్ వంటి దేశీ మ్యాన్యుఫ్యాక్చరర్స్తో సంప్రదింపులు జరుపుతున్నది.
అనా కోరెల్స్, మేగీవీ వంటి గూగుల్ ఉన్నతోద్యోగులు చర్చల నిమిత్తం ఇటీవల భారత్‌ను సందర్శించారు. ఈ చర్చలు ప్రస్తుతం ప్రాధమిక దశలో ఉండగా, ఈ డీల్ ఖరారు కాని పక్షంలో ఇతర భాగస్వాముల ఎంపిక పైనా గూగుల్ దృష్టి సారించింది. జియో స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేక ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అందించేందుకు రిలయన్స్ జియోతోనూ గూగుల్ పనిచేస్తోంది.