Friday, November 15, 2024

ఊపందుకుంటున్న ఫోర్టిఫైడ్‌ బియ్యం తయారీ.. ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న రైస్‌ మిల్లులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారీ ఉపందుకుంటోంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో దశలవారిగా ఫోర్టిఫైడ్‌ బియ్యాన్నే ప్రజలకు పంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్రంలోని రైస్‌ మిల్లులు ఆ దిశగా సాంకేతికతను ఏర్పరచుకుంటున్నాయి. ఇదేకాక కేవలం ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారు చేయడానికే కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని రూపొందించడం, కేంద్రం పోషకబియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించడంతో ఈ బియ్యం తయారీలో పారిశ్రామికవేత్తలకు ఒక్కసారిగా అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమల శాఖ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌లలో ఈ మేరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.


రానున్న రోజుల్లో పెరగనున్న పోషక బియ్యం తయారీ…

ఇప్పటికే 20221-22 మార్కెటింగ్‌ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)కు సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని లెవీ కింద అప్పగించినట్లు సమాచారం. ఫోర్టిఫైడ్‌ బియ్యం తయారీ సామర్థ్యం పెరిగిన తర్వాత రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి వెళ్లే ఈ లెవీ బియ్యం పరిమాణం మరింత పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక కేజీ ఫోర్టిఫై డ్‌ బియ్యానికి కేంద్ర ప్రభుత్వం కేజీకి రూ.72 రూపాయలు చెల్లిస్తోంది. దీంతో వీటి తయారీ వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.

టీఎస్‌ ఫుడ్స్‌ ఆధ్వర్యంలో రూ.42 కోట్లతో ప్లాంటు…

- Advertisement -

పోషక బియ్యం తయారీకి ఇటు ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూనే ప్రభుత్వమే స్వయంగా ఈ రంగంలో పెట్టుబడులు పెడుతుంది. టీఎస్‌ ఫుడ్స్‌ ఆధ్వర్యంలో ఏకంగా రూ.42 కోట్ల పెట్టుబడితో కొత్త ఫోర్టిఫైడ్‌ రైస్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఈ ప్లాంటులో గంటకు ఏకంగా 4 టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని టీఎస్‌ ఫుడ్స్‌ తయారు చేయనుంది. తయారైన ఈ బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థలో పంపిణీ చేసేందుకుగాను పౌరసరఫరాల శాఖకు టీఎస్‌ ఫుడ్స్‌ అప్పగించనుంది. ఈ నూతన ప్లాంటుకు సంబంధించి ఇటీవలే టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ రాజీవ్‌సాగర్‌ అధికారులతో సమీక్షించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ ద్వారా గంటలకు మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యం తయారు చేయవవచ్చని అధికారులు చైర్మన్‌కు వివరించారు. తెలంగాణ ప్రజలకు పోషకాహారమందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని,నూతన ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారీ ప్లాంటును వీలైనంత త్వరగా నిర్మించనున్నట్లు రాజీవ్‌ సాగర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement