Friday, November 22, 2024

Manipur Riots – మ‌హిళ కాల్చివేత …10 వ‌ర‌కు ఇంట‌ర్నెట్ బంద్ …

ఇంఫాల్‌: మణిపూర్‌లో ఇంకా హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్‌ వెలుపల ఒక మహిళను గన్‌తో కాల్చి చంపారు. పశ్చిమ ఇంఫాల్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం శిశు నిష్ఠా నికేతన్ పాఠశాల బయట ఉన్న మహిళపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆమె మరణించింది. ఆ రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య గత రెండు నెలలుగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే ఆ మరునాడే ఒక స్కూల్‌ బయట మహిళను కాల్చి చంపడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.

కాగా, కాంగ్‌పోక్‌పి జిల్లాలోని మాపావో, అవాంగ్ సెక్మై ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా బలగాలు ఈ ఘర్షణను నివారించినట్లు పీటీఐ పేర్కొంది. అలాగే తౌబాల్ జిల్లాలో మరో హింసాత్మక సంఘటన జరిగింది. పోలీస్‌ ఆయుధ డిపో నుంచి తుపాకులు దోచుకునేందుకు అల్లరిమూకల ప్రయత్నించగా ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్బీ) సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లరిమూకలు ఆ సిబ్బంది ఇంటికి నిప్పు పెట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా మ‌ళ్లీ హింస చెల‌రేగుతుండంటంతో ఈ నెల 10 వ‌తేది వ‌ర‌కు ఇంట‌ర్నెట్ ను నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement