న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మణిపూర్ మారణకాండపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపాలని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ హింసపై చర్చ జరపాలనంటూ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు రాజ్యసభలో, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయినా స్పీకర్లు పట్టించుకోకపోవడంతో ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.
దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే ఎంపీలు మళ్లీ ఆందోళన కొనసాగించారు. మళ్లీ సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇప్పటికైనా కేంద్రం మొండివైఖరి వదిలి మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన సమగ్ర చర్చ జరపాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఎంపీల ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు
పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి ముందు బీఆర్‌ఎస్ ఎంపీలు మంత్రి కె.తారక రామారావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. న్యూఢిల్లీ తుగ్లక్ రోడ్‌లోని సీఎం కేసీఆర్ నివాసంలో ఎంపీలు కేకే, నామా నేతృత్వంలో కేక్ కట్ చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని మొక్కలు నాటారు. కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ రాష్ట్రంలో జోష్ నింపుతున్న డైనమిక్ లీడర్ కేటీఆర్ అని ఎంపీలు కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారధిరెడ్డి, దామోదర్ రావు, ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, రంజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.