మణిపూర్‌లో జరుగుతున్న హింసపై చర్చించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో పట్టుబట్టడంతో ఉభయ సభల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్షాల సభ్యులు నిరసనకు దిగారు. ఎంత సేపటికి సభ ఆర్డర్‌లోకి రాకపోవడంతో ఉభయ ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు.
లోక్ సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశంపై విపక్షాలు నిరసనకు దిగాయి. అన్ని అంశాలను పక్కన పెట్టి మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభను స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్ సభను వాయిదా వేశారు స్పీకర్. లోక్ సభలో విపక్ష సభ్యులు మణిపూర్ హింసపై ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. మధ్యాహ్నం లోక్ సభ ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మైనింగ్ సవరణ 2023 బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులతో పాటు పలు బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. అనంతరం లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ ప్రకటించారు. ఈ సమయంలో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్, రాజ్యసభ చైర్మెన్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో రాజ్యసభను సోమవారంకు వాయిదా వేశారు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్.
ఇక వచ్చే వారం రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీలోని ఎన్‌సిటి ప్రభుత్వ బిల్లును వచ్చే వారం చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్, 2023 ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మరియు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు సంబంధించినది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ మణిపూర్ పరిస్థితికి సంబంధించి రూల్ 267 కింద చర్చకు డిమాండ్ చేశారు. బీహార్‌కు చెందిన బిజెపి ఎంపి సుశీల్ కుమార్ సింగ్ దేశవ్యాప్తంగా ఒకే సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి చట్టాన్ని రూపొందించే ప్రతిపాదనను ముందుకు తీసుకురానున్నారు. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ కోసం ఏర్పాటైన కమిటీ తన పనిని పూర్తి చేసిందని, త్వరలో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని ఆయన చెప్పారు.