మణిపూర్‌లోని నోని జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండ చరియలు విరిగిపడిన సంఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నారని, ఇప్పటి వరకు ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బంది, ఐదుగురు పౌరులను రక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో 38 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు పేర్కొన్నారు. తూపుల్ యార్డు రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద రెండురోజుల క్రితం కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
శిధిలాల క్రింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు భారత సైన్యం, అసోం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ, కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలు ప్రయత్నాలు మమ్మురం చేశాయి. వర్షాలతో పాటు ఇతర కారణాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగు తున్నది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్, ఆర్మీ, సివిల్ అధికారులతో కలిసి శుక్రవారం విపత్తు ప్రదేశాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి, రూ 5 లక్షలు, గాయపడిన వారికి రూ 50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో బెంగాల్‌కు చెందిన తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.