హైదరాబాద్ – ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేవేయడమే లక్ష్యంగా హైడ్రా దూసుకువెళుతోంది. చెరువులు, కుంటలు కబ్జా చేసి విలాసావంతమైన ఆకాశఆర్మాలు నిర్మించిన అక్రమార్కుల అంతు తేల్చేందుకు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను రూపొందించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా సినీనటుడు అక్కినేని నాగార్జునాకు చెందిన N కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది. తుమ్మిడి కుంట చెరువు మూడు ఎకరాలు ఆక్రమించి నిర్మించిన భారీ ఫంక్షన్ హాలును కూల్చేశారు హైడ్రా అధికారులు. దీంతో ఇప్పుడు హైడ్రా పేరు వినబడితేనే భయపడుతున్నారు అక్రమార్కులు. భాగ్యనగరంలో ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయో లెక్క తేల్చే పనిలో ఉంది హైడ్రా.
తాజగా మణికొండ చిత్రపూరి కాలనీ లో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. G.O 658 కు విరుద్దంగా 225 ROW హౌజ్ ల నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. గత సొసైటీ పాలక వర్గం దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందిందని తేల్చారు మున్సిపల్ అధికారులు. కేవలం G+1 అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేపట్టారు సదరు బిల్డర్స్. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు మణికొండ మున్సిపల్ కమిషనర్. గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపూరి సొసైటీ కి సుమారు 50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు . చిత్రపురి లో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదుల వెల్లువెట్టడంతో రంగంలోకి దిగారు మణికొండ మున్సిపల్ కమిషనర్.