Saturday, November 23, 2024

Big story | మ్యానిఫెస్టోల మేనియా… తుది రూపుకు బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మ్యానిఫెస్టోల మేనియాకు పార్టీలు సిద్దమయ్యాయి. ప్రజలంతా ఆసక్తితో ఏ పార్టీ ఏం ప్రకటిస్తుందోనని వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అయిపోగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే ఓ అడుగు ముందుకేసి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు- చేసేందుకు సిద్ధమైంది.

ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారి తుదిరూపులో గులాబీ బాస్‌ నిమగ్నమయ్యారు. మ్యానిఫెస్టోలో ప్రకటించే హామీలకు ఎంత ఖర్చువుతుందనే అంశాలపై సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పలు వర్గాలకు చెందిన నిపుణులతో చర్చిస్తూనే సాధ్యాసాధ్యాలపై లెక్కలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పాత, కొత్త పథకాలతో మ్యానిఫెస్టో తుది రూపుకు తెచ్చారు.

సంప్రదింపులు, వాస్తవికతో లెక్కలు…

ప్రజాకర్శక పథకాలపై బీఆర్‌ఎస్‌ సుప్రీం రైటిర్డ్‌ ఐఏఎస్‌లు, ప్రొఫెసర్లు, ఆర్ధిక నిపుణులు, వివిధ రంగాల నిష్ణాతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా నాలుగదు స్కీములకు అంకురార్పణ చేయనున్నారని తెలిసింది.

- Advertisement -

ఆయా పథకాలను ప్రకటిస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రాజెక్టులు, ఇతర ముఖ్యమైన పథకాలకయ్యే వ్యయాలపై లెక్కలేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రగతిభవన్‌కు సీనియర్లను పిలిపించుకుని మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు.

సూపర్బ్‌ పథకాలతో…

అందులో రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పెంపుదల తదితర అనేక పథకాలు ఉన్నట్లు తెలిసింది. రైతుబంధు సాయం ఎకరానికి మరో రూ.1000 పెంచడంతోపాటు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని రూ.1.25లక్షలకు పెంచనున్నారని సమాచారం.

వృద్ధాప్య, వితంతు పింఛన్లను మరో రూ.1000 పెంచే అంశం పరిశీలిస్తున్నారు. రైతులకు అండగా నిల్కచేలా రైతు పింఛన్‌, మహిళలకు మహిళా పింఛన్‌, గ్యాస్‌ సబ్సిడీ పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు సర్కార్‌ అండగా నిల్చేలా ఒక పథకం ప్రకటించనున్నారని తెలిసింది. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర పన్ను వాటా వ్యాట్‌ను కొంత సడలించే అవకాశం ఉంది.

ఆరు గ్యారెంటీలను మరిపించేలా…

ఇటీ-వల తెలంగాణా కాంగ్రెస్‌ తుక్కుగూడ బహిరంగ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఆ స్కీములపై ఇప్పుడు ఓటర్లలో చర్చ కూడా జరుగుతోంది. దీంతో బీఆర్‌ఎస్‌ కూడా కొత్త పథకాలతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కొత్త పథకాలతో పాటు ప్రస్తుతం ఉన్న పథకాలకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రైతుబంధు తరహాలో రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులు (యూరియా, డీఏపీ, ఎన్‌పీకే) లను ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల ఆసరా పింఛన్లను రూ.1,000 పెంచాలని కూడా సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వికలాంగుల పెన్షన్‌ను నెలకు రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచగా.. మిగతా వారికి కూడా రూ.వెయ్యి పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన జ్వరం…రంగంలోకి గులాబీ దళపతి…

కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ త్వరలో రంగంలోకి దిగనున్నారు. త్వరలో కేబినెట్‌ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరగనున్న విజయగర్జన సభలో ప్రకటించనున్న మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రైతులకు ఫించను, ఉచితంగా ఎరువుల పంపిణీ, మహిళలు, యువత, బీసీలు, మైనారిటీలకు పలు ఎన్నికల హామీలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత కేసీఆర్‌ కూడా సుమారు వంద నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. గోవా- కర్ణాటక, ఏపీ-తెలంగాణ, పంజాబ్‌ – హర్యానా – రాజస్థాన్‌- హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ- తమిళనాడు, తమిళనాడు-కర్ణాటక మధ్య జలవివాదాలెకు కేంద్రమే కారణమని, ఈ వైఫల్యాలను ఎండగట్టే ఎజెండాతో గులాబీ పార్టీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఫలితాలను భవిష్యత్తులో దేశానికి అందివ్వాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

అందుకోసం తెలంగాణ నమూనాను ఆదర్శంగా చూపిస్తూ మేనిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం దేశానికి 24గంటల విద్యుత్‌ సరఫరా హామీని బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలో చేర్చనుంది. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెడతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చనుంది బీఆర్‌ఎస్‌. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు వారాలుగా సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో రూపకల్పనపై వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

బ్రహ్మాండమైన పథకాలతో ప్రజల్లోకి…

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు తమ వద్ద బ్రహ్మాండమైన పథకాలున్నాయని చెప్పిన బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ అన్నరది అన్నట్లుగా రెడీ అవుతున్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కసరత్తు దాదాపు పూర్తైనట్లు సమాచారం. ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా పార్టీ ఎన్నికల హామీలు ఉండనున్నట్లు తెలిసింది.

కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల కళ్లు తిరిగేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌ రావు మేనిఫెస్టో విషయంలో ప్రజలకు లీకులు ఇచ్చారు. త్వరలోనే మరిన్ని శుభవార్తలు వింటారని, ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.

భారమెంత…రాబడి ఎలా…?

గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేయని నిరుద్యోగ భృతిపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. నిరుద్యోగ యువత సంఖ్యపై స్పష్టత వచ్చిన తర్వాత సీఎం దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ కీలక నేత వెల్లడించారు. ఇలా బీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలిసింది.

యువతలో నిరుత్సాహాన్ని ప్రారదోలేలా సరికొత్‌త ఉపాధి పథకంపై పార్టీ ఆలోచనలు చేస్తోంది. నిరుద్యోగ భృతి నగదుగా కాకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పనపై దృష్టిసారిస్తోంది. ప్రస్తుత పథకాలకు సాయం పెంచడంతోపాటు పాత, కొత్త పథకాలతో పడే ఆర్ధిక భారం, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్ధిక వెసులుబాటు, ప్రజాసంక్షేమం కోసం వివరించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత సిద్దమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement