Friday, November 22, 2024

తమిళనాడుపై మాండూస్‌ పంజా.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తమిళనాడుపై మండూస్‌ తుపాను పంజా విసిరింది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్‌ తుఫాను.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర తుఫానుగా మారింది. దీనిప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 98 పశువులు మృతిచెందాయి. మరోవైపు 181 నివాసాలు దెబ్బతిన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో అంధకారం నెలకొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement