న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీలో అమిత్ షాను కలిసిన మంద కృష్ణ ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు.
సుదీర్ఘకాలంగా తాము చేస్తున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని వినతి పత్రంలో ఆయన కేంద్రాన్ని కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని అభ్యర్థించారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను ఆ వర్గంలోని కొన్ని కులాలు మాత్రమే అందుకుంటున్నాయని, అనేక కులాలకు ఆ ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వర్గీకరణ ద్వారానే అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలను అందించగలమని తెలిపారు.
ఈ అంశంపై అనేక రాజకీయ పార్టీలు సైతం ఏకీభవిస్తున్నప్పటికీ వర్గీకరణ మాత్రం జరగడం లేదని అన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 7న తెలంగాణలోని ఆలంపూర్ నుంచి హైదరాబాద్ శివార్ల వరకు పాదయాత్ర తలపెట్టినట్టు వివరించారు. మందకృష్ణ విజ్ఞప్తిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. భాగస్వామ్య పక్షాలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.