Tuesday, November 26, 2024

ఓ హీరో ఆఫీసు నుంచే నాపై ట్రోల్స్ – సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించిన మంచు విష్ణు

త‌న కుటుంబంపై పెయిడ్ క్యాంపెయిన్ చేయిస్తున్నార‌ని ..ఓ హీరో ఆఫీసు నుంచే త‌న‌పై ట్రోల్స్ జ‌రుగుతున్నాయ‌ని ఆరోపంచారు ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ..తన తాజా చిత్రం జిన్నా ప్రమోషన్స్‌ను మంచు విష్ణు గురువారం ప్రారంభించారు. తాను నటించిన జిన్నా చిత్రం ట్రైలర్‌ను అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్టుగా మంచు విష్ణు చెప్పారు. అక్టోబర్ 21న సినిమా విడుదల కానుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రోల్స్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. తమకు రెండు ఐపీ అడ్రస్‌లు రావడం జరిగిందని.. అందులో ఒకటి జూబ్లీహిల్స్ ఆఫీసు అని, ఇంకోటి చెక్‌పోస్టు వద్ద ఉందని తెలిపారు.

ఇక్కడి నుంచి పెయిడ్ బ్యాచ్ పనిచేస్తుందని ఆరోపించారు. ట్రోల్స్‌కు సంబంధించి 18 యూట్యూబ్ చానళ్లపై కేసులు పెడుతున్నట్టుగా తెలిపారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తనపై ట్రోల్స్ చేస్తున్నారని.. ఇవన్నీ పోలీసులు చెబితే తనకు తెలిసిందన్నారు. ఇన్ని డబ్బులు పెట్టి తనమీద పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నారంటే నవ్వు తెప్పిస్తుందని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అప్పటి నుంచే ఈ ట్రోల్స్ ప్రారంభం అయ్యాయని చెప్పారు. వాళ్ల పేర్లు బయటకు వస్తే పరువు పోతుందని అన్నారు. గతంలో సినీ పరిశ్రమంతా ఒక కుటుంబంలా ఉండేదని అన్నారు. సాధారణంగా తాను ట్రోల్స్‌ను పట్టించుకోనని మంచు విష్ణు చెప్పారు. జవాబుదారీతనం కోసమే కేసులు పెడుతున్నట్టుగా తెలిపారు. తనకు ప్రస్తుతానికి థియేటర్ల సమస్య లేదని వెల్లడించారు. తనకు అన్యాయం జరిగితే మాట్లాడటానికి వెనకాడనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement