ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లపై బీజేపీ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పుడు అవి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధాని మనసులో మాట కార్యక్రమం ‘మన్ కీ బాత్’తో రూ.కోట్ల ఆదాయం వస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2014లో ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ తన మనసుకు నచ్చిన అంశంపై ఈ కార్యక్రమంలో మాట్లాడుతారు.
అలా ఇప్పటివరకు ప్రధాని మోదీ 78 ఎపిసోడ్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంతో ఇప్పటివరకు రూ.30.80 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఏ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందో వివరంగా సభకు తెలిపింది. 2014-15లో రూ.1.6 కోట్లు, 2015-16లో రూ.2.81 కోట్లు, 2016-17లో రూ.5.14 కోట్లు, 2017-18లో రూ.10.64 కోట్లు, 2018-19లో రూ.7.47 కోట్లు, 2019-20లో రూ.2.56 కోట్లు, 2020-21లో రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది.