Tuesday, November 26, 2024

బ్యాంకులకు రూ.200 కోట్లు టోకరా వేసిన నిందితుడు అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు రూ.200 కోట్లు టోకరా వేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి ఒడిశాకు చెందిన సంబంధ్‌ ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సీఈవో, ఎండీ దీపక్‌ కిండో (43) అనే వ్యక్తి లోన్లు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వ్యాపారం చేసేందుకు మైక్రో ఫైనాన్స్‌ అందిస్తానని చెప్పి పలు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్ల నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకు రుణం తీసుకున్నాడు. అనంతరం చెల్లింపులు జరపకుండా ఎగవేస్తున్నాడు.

నిందితుడు దీపక్ కిండోపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే విధంగా నాబార్డ్‌ అనుబంధ సంస్థ నాబ్‌ సమృద్ధి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించిన అనంతరం మిగతాడబ్బు చెల్లించకుండా ఎగవేశాడు. నాబ్‌ సమృద్ధి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అధికారి దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఒడిశాలోని రాజంగ్‌పూర్‌లో ఉన్న నిందితుడు దీపక్‌ కిండోను అరెస్ట్‌ చేసి పీటీ వారెంట్‌పై నగరానికి తరలించారు.

ఈ వార్త కూడా చదవండి: మెహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు

Advertisement

తాజా వార్తలు

Advertisement