Friday, November 22, 2024

కింగ్ కోఠి ఘటనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదు అయ్యింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్  హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, డీఎంహెచ్‌వో, హాస్పిటల్ సూపరింటెండెంట్, నోడల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కమిషన్‌ ను కోరారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడం కారణంగా క్షేత్రస్థాయిలో ఇటువంటి లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో పాటు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ యుగేందర్ గౌడ్ కమిషన్‌ ను కోరారు.

మరోవైపు కింగ్ కోఠి ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా ముగ్గురు క‌రోనా రోగులు చ‌నిపోయార‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్(డీఎంఈ) డాక్ట‌ర్ కే ర‌మేశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం కోఠి హాస్పిట‌ల్‌లో 13 కేఎల్ లిక్విడ్ ఆక్సిజ‌న్ ఉంద‌ని తెలిపారు. అయితే ఆ ముగ్గురు రోగులు వెంటిలేట‌ర్‌ పై చికిత్స పొందుతున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌తి రోజు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని చెప్పారు. గ‌తేడాది కాలం నుంచి కరోనా రోగుల‌కు అత్యుత్త‌మైన సేవ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా రోగులు చనిపోలేదు. ఇలాంటి వార్త‌ల‌ను చూసి ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావద్దని సూచించారు.

కాగా, కింగ్‌ కోఠి ఆస్పత్రిలో నిన్న ముగ్గురు కరోనా రోగులు చనిపోయారు. ఆస్పత్రిలో చేరిన వీరికి ఆక్సిజన్ సమయానికి అందకపోవడంతో వీరు మృతి చెందారు. జడ్చర్ల నుంచి కింగ్ కోఠి ఆస్పత్రికి రావాల్సిన ఆక్సీజన్ ట్యాంకర్ ఆలస్యమైంది. ఈ లోపు ఆక్సిజన్ అందక ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ వాళ్ల మృతికి కారణమైన వారిని శిక్షించాలని బంధువులు ఆస్పత్రి ఎదుట డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement