Monday, November 18, 2024

ఈనెల 10న నామినేషన్ వేయనున్న మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్‌లో జరిగే భ‌వానీపూర్ ఉపఎన్నిక‌ కోసం తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా తాను ఈ నెల 10 నామినేష‌న్ దాఖ‌లు చేస్తాన‌ని సీఎం మ‌మ‌తాబెన‌ర్జి ప్ర‌క‌టించారు. ఏడాది ఆరంభంలో ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో కేవ‌లం ఆ భ‌గ‌వంతుడికి మాత్ర‌మే తెలుస‌ని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన కుట్ర‌లు అన్నీఇన్నీ కావ‌న్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌గానే హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డార‌న్నారు. పైగా ఇప్పుడు త‌ప్పు త‌మ‌పై మోపుతూ అబ‌ద్దాలు చెబుతున్నాని ఆరోపించారు.

అప్పుడు ఎన్ని కుట్ర‌లు చేసినా బీజేపీ అధికారంలోకి రాలేక‌పోయింద‌ని, ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో కూడా వాళ్లు గెలిచే అవ‌కాశం లేద‌ని మ‌మ‌తాబెన‌ర్జి ధీమా వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లో నందిగ్రామ్‌లో త‌న‌పై జ‌రిగిన దాడిలో కూడా బీజేపీ కుట్ర ఉన్న‌ద‌ని ఆమె ఆరోపించారు. బ‌య‌టి నుంచి వ‌చ్చిన దాదాపు 1000 మంది బీజేపీ గూండాలు బెంగాల్ గురించి తప్పుడు ప్ర‌చారం చేశార‌ని ఆమె మండిప‌డ్డారు. రాజకీయంగా పోరాడే స‌త్తా లేక‌నే వాళ్లు విప‌క్షాల‌పై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తున్నార‌ని మమతా విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement