మమతా బెనర్జీ కోసం బెంగాల్ శాసనసభ ఏకంగా శాసనమండలిని ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేగా ఎన్నికకాలేక తీరథ్సింగ్ రావత్ సీఎం పదవిని పోగొట్టుకోవడంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జి మేల్కొన్నారు. రేపు తనకూ అదే పరిస్థితి ఎదురుకాకుండా ఉండటం కోసం రాష్ట్రంలో కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేకపోయినా మండలిలో ఎమ్మెల్సీ పదవి చేపట్టి సీఎం పదవికి ఢోకా లేకుండా చూసుకోవచ్చని ఆమె భావిస్తున్నారు. అ మేరకు ఇవాళ బెంగాల్లో శాసన మండలి ఏర్పాటుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు.
శాసనమండలి ఏర్పాటయితే మమత ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం పదవిలో కొనసాగవచ్చు. మరోవైపు శాసనసభ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తారు. ఈ తీర్మానంపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించాల్సి ఉంది. పదవీగండం నుంచి గట్టెక్కడానికే మమత మండలిని పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
బెంగాళ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆమె చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. అంటే అక్టోబరులోగా శాసనసభకు ఆమె ఎన్నిక కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఏదైనా శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగకపోతే ఆమె సీఎం పదవికి గండం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శాసనమండలిని ఏర్పాటు చేయడానికి బెంగాల్ శాసనసభ తీర్మానం చేసింది. శాసనసభకు హాజరైన 265 మంది ఎమ్మెల్యేలలో 196 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ సభ్యుల అభ్యంతరాల మధ్యే ఈ తీర్మానం ఆమోదం పొందింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం ?