పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కొంతకాలంగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించడంపై స్పందిస్తూ, బీజేపీ పెద్దలను దుర్యోధనులు, దుశ్శాసనులతో పోల్చారు. “మాకు బీజేపీ వద్దు. బీజేపీని సాగనంపండి. మేం మోదీ ముఖాన్ని చూడాలని కోరుకోవడంలేదు. మాకు అల్లర్లు వద్దు. లూటీలకు పాల్పడేవాళ్లు, దుర్యోధనులు, దుశ్శాసనులు, మీర్ జాఫర్‌ను మేం కోరుకోవడంలేదు. మార్చి 27న ఆట మొదలవుతుంది. బీజేపీ బౌల్డ్ అవడం ఖాయం” అని మమత ధీమా వ్యక్తం చేశారు.
ఒకప్పుడు తాను సువేందు అధికారిని గుడ్డిగా నమ్మానని, కానీ నమ్మక ద్రోహం తలపెట్టాడని మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి బీజేపీతో టచ్‌లో ఉంటూ వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. అలాంటి వాళ్లను నమ్మినందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో సీఎం మమతపై పోటీ చేస్తుండడం తెలిసిందే.