Thursday, September 19, 2024

Mamata Banerjee | విధుల్లో చేరండి… జూ.డాక్టర్లకు మమతా విజ్ఞప్తి

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అనూహ్య పరిణామం జరిగింది. ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యుల వద్దకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వెళ్లారు. నిరసన శిబిరానికి చేరుకున్న ఆమె వారికి సంఘీభావం తెలుపుతూనే, విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.

తాను ఇక్కడికి సీఎంగా రాలేదని, మీ సోదరిగా వచ్చానని చెప్పారు. ఇది ఉత్తరప్రదేశ్‌ కాదని, మీకు వ్యతిరేకంగా వ్యవహరించనని, తనకు సీఎం పదవి ముఖ్యం కాదని స్పష్టంచేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని తెలిపారు. అయితే, సీఎం తమ శిబిరం వద్దకు రాగానే వైద్యులు నినాదాలు అందుకున్నారు. న్యాయం కావాలి.. న్యాయం కావాలి.. అంటూ బిగ్గరగా అరవడం ప్రారంభించారు.

వైద్యుల వ్యతిరేక నినాదాల మధ్య బెంగాలీలో మమత మట్లాడారు. ‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆపై నినాదాలు చేయండి. అలా చేయడం మీ ప్రజాస్వామ్య హక్కు. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. నా భద్రతా అధికారుల సలహాకు వ్యతిరేకంగా, మీ నిరసనకు సెల్యూట్‌ చేయడానికి నేను ఇక్కడకు వచ్చా. పదవి పెద్ద విషయం కాదని నాకు తెలుసు. మీ వాయిస్‌ ముఖ్యం’ అని దీదీ శాంతివచనాలు పలికారు. భారీ వర్షంలోనూ రోడ్డుపై నిరసనలు చేస్తుంటంతో నేను కూడా నిద్రలేని రాత్రులు గడిపాను. మీ నిరసన ఉద్దేశం నాకు అర్థమైంది. నేను కూడా విద్యార్థి నాయకురాలిని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మీకు న్యాయం చేస్తా. మీ సహాయం లేకుండా సీనియర్‌ వైద్యులు పనిచేయలేరు. నేను మీ డిమాండ్లను పరిశీలిస్తాను. ప్రభుత్వం అంటే నేనొక్కదాన్నే కాదు కదా.. ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌తో మాట్లాడతాను. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను” అని వైద్యులకు హామీ ఇచ్చారు.

మీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సరైన వైద్యం అందక చాలామంది రోగులు మరణిస్తున్నారు. ఇకపై ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాను. ప్రతి ఆసుపత్రిలో సీనియర్‌, జూనియర్‌ డాక్టర్లు సభ్యులుగా ఉండే కమిటీలను ఏర్పాటు చేస్తాను. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు. మీపై ఎటువంటి చర్య తీసుకోను. మీరు చాలా పనిచేస్తారని నాకు తెలుసు.. నా మాట వినండి.. నాపై నమ్మకం ఉంచండి.. విధుల్లో చేరండి” అని దీదీ విజ్ఞప్తి చేశారు.

సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇదే నా చివరి ప్రయత్నం… మీరు నాపై నమ్మకం ఉంచితే, మీ ఫిర్యాదులను నేను పరిశీలిస్తాను. కేసు సుప్రీంకోర్టులో ఉంది. తదుపరి విచారణ మంగళవారం జరగనుంది. నేను కూడా 26 రోజుల పాటు నిరాహారదీక్ష చేశాను. కానీ అప్పటి ప్రభుత్వం నుండి ఎవరూ నాతో మాట్లాడటానికి రాలేదు అని మమత వ్యాఖ్యానించారు. అయితే, తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పారు. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని భీష్మించారు. దీంతో చేసేదిలేక మమతా బెనర్జీ అక్కడినుంచి వెళ్లిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement