న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ పెండింగ్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీ చేరుకున్న ఆయనకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో డప్పు వాయిద్యాలు, జానపద కళాకారుల నాట్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి , అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ గౌడ్, తెలంగాణ రాష్ట్రం నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు మల్లు రవికి అభినందనలు తెలిపారు. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. తనను ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ వద్ద రక్షణ శాఖ భూములు వంటి అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇటీవల
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క 15 అంశాల పట్ల ప్రధానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. నీటి ప్రాజెక్టులు, ఆర్ధిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్న అంశాలపై తనకు ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని స్పష్టం చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని మల్లు రవి గుర్తు చేశారు. నమ్మకం, తనకు ఉన్న పని చేసే సమర్ధతను గుర్తించి ఆ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని వివరించారు.
ఈ పదవి ద్వారా తనకు ఉద్యోగం వచ్చినట్లుగా భావించడం లేదన్న మల్లు రవి, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పాజెక్టుకు జాతీయ హోదా సహా పెండింగ్ అంశాలను ప్రాధాన్యత క్రమంలో కేంద్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాల స్టేటస్ గురించి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తానని ఆయన వెల్లడించారు. నగర్ కర్నూల్‌లో రైల్వే లైన్ ప్రాజెక్టుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌పై కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న సివిల్ సర్వీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధి కోసం వారి సహకారం కూడా తీసుకుంటామని మల్లు రవి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. హైదరాబాద్ హౌజ్‌కి అనుకుని ఉన్న శబరి బ్లాక్ వద్ద మూడు ఎకరాల తెలంగాణ భవన్‌కు వస్తుందని, పటౌడీ హౌజ్‌లో ఉన్న భూమిని రెండు రాష్ట్రాలు పంచుకునేలా ఒప్పందాలు జరిగాయని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి హోంశాఖ వద్ద పెండింగులో ఉన్న ఫైల్‌ను త్వరగా క్లియర్ చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.
శబరి బ్లాక్‌లో సీఎం, గవర్నర్ ఉండేందుకు భవనాలు, పటౌడీ హౌస్‌లో భవన్ అధికారులు, క్వార్టర్స్ నిర్మాణం జరిగేలా తెలంగాణ భవన్ కట్టడాలు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మల్లు రవి తెలిపారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో 2 అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ప్రతినిధిగా, అవసరమైతే ఎంపీగా ఢిల్లీలో ఉండి పని చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.