93స్థానాలకు గాను 66 స్థానాల్లో పాగా
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకే
అక్కడి ప్రజలు పట్టం
కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే విజయ కేతనం
మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. మాల్దీవ్స్ పార్లమెంటులో మొత్తం 93 సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 86 స్థానాలకు ఫలితాలు విడుదలయ్యాయి. అందులో 66 స్థానాలను పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనదాని కంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
మాల్దీవులలో ఉన్న 93 పార్లమెంటు స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. అయితే, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారగా, చైనా వైపు ముయిజ్జు మొగ్గు చూపడాన్ని ప్రజలు సమర్థిస్తున్నట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పీఎన్సీ, మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీతో సహా ఆరు పార్టీలకు చెందిన 368మంది అభ్యర్థులు పోటీ చేశారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు పోటీ చేయగా…. కేవలం ముగ్గురు మాత్రం విజయం సాధించారు.