Tuesday, November 26, 2024

అరుగుదల ముప్పులో మలయప్పస్వామి.. కొత్త విగ్రహం ఏర్పాటులో కొండంత సమస్యలు

తిరుపతి, ప్రభన్యూస్‌బ్యూరో (రాయలసీమ): శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుమలేశుని ఉత్సవమూర్తి మలయప్పస్వామి విగ్రహం అదనపు అభిషేక కైంకర్యాలతో అరుగుదల ముప్పునకు గురవుతోంది. ఆ విగ్రహం స్ధానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆగమపరంగా పలురకాల సమస్యలను అధిగమించాల్సి వుంటుంది. ఈ దశలో మలయప్పస్వామి ఉత్సవమూర్తిని కాపాడుకోడానికి ఆర్జిత సేవల పేరుతో నిర్వహించే అభిషేక కైంక ర్యాలను నిలిపివేయాల్సిన అవస రం ఉందని వైఖానస ఆగమ పండితులు, అర్చకులు స్పష్టం చేస్తున్నారు. ఆ ఆర్జిత సేవలను రద్దు చేయడం ద్వారా ప్రతిరోజూ కనీసం 10 వేల నుంచి 15 వేల మంది భక్తులకు తిరుమలేశుని దర్శనభాగ్యం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ఆధునికకాలగణనకు అంతుపట్టని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆవిర్భావచరిత్రలో ఉత్సవ మూర్తి మలయప్పస్వామి శతా బ్దాల చరిత్ర మాత్రం కనిపిస్తుంది. వేంకటాచలమహాత్య్మం ప్రకారం 13వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో ఉగ్రశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని వినియోగించలేని సమస్య ఏర్పడింది. ఏం చేయాలో తెలియనిదశలో ఒక భక్తుడి ద్వారా శ్రీదేవి, భూదేవి సమేతమైన తన ప్రతిరూపం తిరుమల కొండల్లో లభిస్తుందని స్వయంగా తిరుమలేశుడే తెలియచేసారు.

ఆయన సూచనల మేరకు కొండల్లో గాలించినప్పుడు తిరుమలేశుని ప్రతిరూపంలా కటి,వరదహస్తాలతో నిలచిన 3 అడుగుల ఎత్తయిన పంచలోహ విగ్రహం, శ్రీదేవి, భూదేవి విగ్రహాలతో పాటు లభించింది. కొండల్లో లభించినందున ఆ స్వామికి మలయప్ప స్వామి అనే పేరు వచ్చింది. ఆ విగ్రహాలు లభించిన చోటిని ఇప్పటికీ మలయప్పకోస అనే పేరుతోనే పిలుస్తుంటారు. ఆనాటి నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మూలమూర్తి ప్రతిరూపంగా నిత్య, వార, మాస, వార్షిక, ఉత్సవాలలో, బ్రహ్మోత్సవాల వాహనసేవల న్నిటిలో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే జేష్టాభి షేకం సందర్బంగా మాత్రమే బంగారు తొడుగులు లేని మలయప్ప స్వామి స్నపన తిరుమంజన సేవలో దర్శనమిస్తారు. అటువంటి సుదీర్ఘ చరిత్ర కలిగిన మలయప్పస్వామికి ఏడాది పొడుగునా పలురకాల సేవల సందర్బంగా 450 సార్లు అభిషేక కైంకర్యాలను నిర్వహిస్తుంటారు. ఇందులో వైఖానస ఆగమోక్తంగా నిర్వహించి తీరాల్సిన సేవలతో పాటు నిర్దేశిత రుసుము చెల్లించే భక్తుల కోసం నిర్వహించే ఆర్జిత సేవలు కూడా ఉన్నా యి. శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ సేవల సందర్బంగా చేసే రకరకాల సుగంధద్రవ్యాల అభిషేకార్చనలతో మలయప్పస్వామి విగ్రహం అరుగుదలకు గురవుతున్నట్టు అర్చకులు గుర్తించారు. ఆ అరుగుదల ప్రభావం పలుచోట్ల ఉన్నా ముఖ్యంగా విగ్రహం పాదాల వద్ద ఎక్కువగా కనిపిస్తున్నట్టు అర్చకులు గమనించారు. ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిం చాలనే విషయంపై అర్చకస్వాముల, ఆగమపండి తులు, ఆగమ సలహాదారుల నడుమ గత రెండు, మూడునెలులుగా విశేష చర్చలు కొనసాగాయి.

ఆగమశాస్త్ర ప్రకారం అరుగుదల ముప్పు ఉన్న విగ్రహాన్ని కరిగించి అదే లోహాన్ని వినియోగించి ఎటువంటి మార్పుచేర్పులు లేని విగ్రహరూపాన్ని తయారు చేయాల్సివుంటుంది. రూపసామ్యంలో ఎటువంటి చిన్న పొరబాటు జరిగినా దైవాపచారం జరిగినట్టే అవుతుంది. ఈ నేపథ్యంలో మలయప్ప స్వామి విగ్రహాన్ని కరిగించి కొత్త విగ్రహం తయారు చేయించా లంటే శతాబ్దాలుగా కోట్లాదిమంది భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలచివున్న స్వామి రూపంలో మార్పులు కనిపిస్తే ఎటువం టి విమర్శలు ఉత్పన్నమవుతాయనే భయాందోళనలు ఇటు అర్చకులు, ఆగమ పండితులు, అటు అధికారులలో కలుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మలయప్పస్వామికి నిత్య,వారాంతపు ఆర్జిత సేవల్లో భాగంగా అభిషేక కైంకర్యాలను తగ్గించడం మంచిదని ఆగమ పండితులు, అర్చకులు సంయుక్తంగా టిటిడి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. కొత్త విగ్రహం ఏర్పాటు విషయంలో ఉన్న భయాందోళనల ను దృష్టి ఉంచుకుని మలయప్పస్వామికి అభిషేక కైంకర్యం చేసే ఆర్జిత సేవలను తగ్గించాలని టిటిడి అధికారులు ఇటీవలే నిర్ణయించారు. సంబంధిత అధికార ప్రకటన వెలువడిన మరుక్షణం భక్తులు నగదు చెల్లించి పాల్గొనే ఆర్జిత సేవలను తగ్గించడమేమిటని పలువురు ప్రతిపక్షాల ప్రతినిధులు రచ్చకెక్కారు. దీనిపై స్పందించిన టిటిడి ఉన్నతాధికారులు గంట, రెండు మూడు గంటలపాటు నిర్వహించే ఆర్జిత సేవల్లో అత్యధికంగా రెండు,మూడు వందల మంది భక్తులు పాల్గొంటారని, వాటిని నిలిపివేయడం వల్ల అదే రెండు మూడు గంటల్లో 10 నుంచి 15 వేల మంది భక్తులకు స్వామి దర్శనభాగ్యం కలిగించే అవకాశం ఉంటుందని వివరణ ఇస్తున్నారు.


ఈ వాదోపవాదాల సంగతెలా వున్నా శతాబ్దాల పాటు కొనసాగించిన పలురకాల సుంగధద్రవ్యాల కారణంగా అరుగుదలకు గురవుతున్న మలయప్ప స్వామి విగ్రహాన్ని కాపాడేందుకు ఆర్జితసేవలను తగ్గించడం సముచితమేనని ఆంధ్రప్రభ తో మాట్లాడిన టిటిడి వైఖానస ఆగమ సలహాదారు వేదాన్తం విష్ణుభట్టాచార్యులు స్పష్టం చేసారు. ఆగమశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ కొత్త విగ్రహం తయారు చేయించడంలో పలురకాల ఆటం కాలు ఉన్నందున అభిషేక ఆధారిత ఆర్జితసేవలను తగ్గించడం ద్వారా మరింతకాలం మలయప్పస్వామి విగ్రహాన్ని కాపాడు కోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరమే ఆగమపండితులు, అర్చకులు ఏకాభి ప్రాయంతోనే ఆర్జిత సేవల తగ్గింపు ప్రతిపాదనను టిటిడి ఉన్నతాధి కారులకు సమర్పించినట్టు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ధృవీకరించిన టిటిడి కార్యనిర్వహణా ధికారి ఎ.వి.ధర్మారెడ్డి ఆగమ పండితుల, ఆర్చకుల సూచనల మేరకే ఇటీవల ఆర్జిత సేవలను తగ్గించామని, మరోవైపు ఆ సేవలకు కేటాయించే సమయంలో 10 వేల నుంచి 15 వేల మంది భక్తులకు తిరుమలేశుని దర్శించుకునే అవకాశం కల్పించగలుగుతున్నామని చెప్పారు. ఎంతో దూరదృష్టిలో ఆలోచించి తీసుకునే టిటిడి నిర్ణయాలకు దురుద్దేశాలను ఆపాదించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమలేశుని భక్తుల మనస్సులలో అనుమానాలను కలిగించడం, తద్వార తిరుమలక్షేత్ర ప్రతిష్టను తగ్గించడం సముచితం కాదని అన్నారు. ఇటువంటి అంశాల విషయంలో నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రచారాలు చేయడం మంచిదికాదని కూడా సూచించారు. మొత్తంమీద శతాబ్దాలచరిత్ర కలిగిన తిరుమ లేశుని ఉత్సవమూర్తి మలయప్పస్వామి విగ్రహాన్ని ఆరుగుదల సమస్య నుంచి కాపాడుకోడానికి నిర్వహిం చే అభిషేక ఆధారిత ఆర్జిత సేవలను తగ్గించడం ప్రస్తుతానికి ఉత్తమ మార్గమని స్పష్టమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement