మలయాళంలో నెల రోజుల కిందట ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది రొమంచన్ చిత్రం. కేవలం రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్దులు నెలకొల్పింది. ఈ సినిమాలో షౌబిన్ షాబిర్ తప్పతే పెద్దగా పేరున్న నటుడే లేదు. ఇక దర్శకుడిగా జీతూ మాధవన్‌కు ఇది తొలిచిత్రం. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో సరదాగా ఔజా అనే ఒక గేమ్ అడుతారు. ఓ బోర్డు మీద ఇంగ్లీష్ లెటర్స్ ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడం ఈ గేమ్ థీమ్.
అలా ఏదో టైమ్ పాస్ కోసం మొదలుపెడితే ఇది కాస్తా అనుహ్య సంఘటనలకు దారి తీస్తుంది.ఓ వైపు భయపెడతూనే మరోవైపు నవ్విస్తూ కథ సాగుతుంది. ఇది చాలా మందికి తెలిసిన కథే. ఇక్కడ స్పిరిట్ గేమ్ అని అంటుంటారు. కానీ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం గొప్పగా ఉంటుంది. నటీనటులు కూడా పోటా పోటీగా నటించారు. తెరపై వీళ్లు నటించినట్లు అనిపించదు. పాత్రల్లో జీవించినట్లు అనిపిస్తుంది. కాగా ఇప్పుడీ రొమంచన్ రీమేక్ హక్కులకు తెలుగులో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. పేరు మోసిన నిర్మాణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.