Tuesday, November 26, 2024

పర్వతారోహణలో మలావత్ పూర్ణ మరో రికార్డ్ .. నాసా సైంటిస్ట్ కావ్య మన్యపుతో కలిసి “ప్రాజెక్ట్ శక్తి” యాత్ర

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆడపిల్లలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఎంపవర్, ఎడ్యుకేషన్, ఎలివేషన్ – విజన్‌తో “ప్రాజెక్ట్ శక్తి” యాత్ర చేపట్టామని పర్వతారోహకులు మలావత్ పూర్ణ, కావ్య మన్యపు తెలిపారు. వారిద్దరూ కలిసి లద్దాఖ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఎక్కని పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ నెలకొల్పారు. పూర్ణ, కావ్య ఇద్దరూ తెలంగాణలోని కామారెడ్డికి చెందినవారే. పూర్ణ ఇప్పటికే 7 ఖండాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. అమెరికాలోని నాసాలో అంతరిక్ష పరిశోధకురాలిగా పని చేస్తున్నకావ్య మన్యపు, పూర్ణ కలిసి ఆడపిల్లల విద్య కోసం ప్రాజెక్ట్ శక్తి పేరుతో పర్వతారోహణ మొదలుపెట్టారు. వంద మంది నిరుపేద, ప్రతిభావంతులైన బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడమే ‘ప్రాజెక్ట్ శక్తి’ లక్ష్యం. మొత్తం లక్ష డాలర్లు (70-80 లక్షల రూపాయలు) నిధుల సేకరణే ధ్యేయంగా పెట్టుకున్న కావ్య, పూర్ణ 8 మంది సభ్యులతో బృందంగా ఏర్పడి పర్వతారోహణ ప్రారంభించారు. ఆ బృందానికి లీడర్‌గా రెన్సీ థామస్, డిప్యూటీ లీడర్‌గా దివ్య ఠాకూర్ వ్యవహరించారు. పర్వతారోహణ పూర్తి చేసుకుని ఢిల్లీ వచ్చిన పూర్ణ, కావ్య సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

మాలా మరో వంద మందిని తయారు చేస్తాం : కావ్య మన్యపు
ఇకపై తాము చేపట్టే ప్రతి పర్వతారోహణ ద్వారా లక్ష డాలర్లను సేకరిస్తామని కావ్య వెల్లడించారు. వాటిని వంద మంది పేద బాలికల విద్య, సాధికారితకు వినియోగిస్తామన్నారు. అమ్మాయిలు ఏదైనా సాధించగలరని చెప్పాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. కామారెడ్డిలో పుట్టిన తమ ఇద్దరి ఆశయాలు ఒకటేనని, తమలా మరో వంద మందిని తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని కావ్య చెప్పుకొచ్చారు. పర్వతారోహణను వేదికగా చేసుకుని ప్రాజెక్ట్ శక్తిని ముందుకు తీసుకెళ్తున్నామని కావ్య వివరించారు. పేరు కూడా ఇంకా పెట్టని, ఎవరూ ఇంతవరకు ఎక్కని పర్వతాన్ని ఎక్కి ప్రాజెక్ట్ శక్తిలో మొదటి అడుగు వేశామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్లి అక్కడ వంద మంది చురుకైన అమ్మాయిలను గుర్తించాలనుకుంటున్నట్టు తెలిపారు. అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అమెరికాలో ఒక విద్యా సంస్థ మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తామని కావ్య వెల్లడించారు. విరాళాలు తీసుకుని ఒక ఎన్జీవోకు ఇచ్చి వదిలేయకుండా తాము కూడా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ప్రాజెక్ట్ శక్తికి నిధులు సమీకరిస్తున్నామని తెలిపారు. పూర్ణతో పోల్చుకుంటే తాను అమెచ్యూర్ మౌంటెనీర్‌నన్న కావ్య, ఇప్పటివరకు కిలిమంజారో ఎక్కానని, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నానని, అలాస్కా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కొన్ని పర్వతాలు అధిరోహించానని తెలిపారు.

ఏ ఒక్క ఆడపిల్లా వెనుకబడిపోకూడదు : మలావత్ పూర్ణ
సమాజం తనకు చాలా ఇచ్చిందని, తాను కూడా సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ శక్తి చేపట్టినట్టు పూర్ణ తెలిపారు. అతిచిన్న వయసులోనే ఎవరెస్ట్ ఎక్కడంతో పాటు ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలు ఎక్కి రికార్డు సృష్టించానని వివరించారు. భవిష్యత్‌లో మనదేశంలో ఏ బాలిక కూడా వెనుకబడిపోకూడదన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, తామే ఆ పర్వతారోహణకు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి కావాల్సింది విద్యని పూర్ణ నొక్కి చెప్పారు. దానికోసమే తాము ప్రయత్నిస్తున్నాం కాబట్టి అందరి ఆశీర్వాదం, సహకారం కావాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement