Friday, November 22, 2024

Delhi: సబ్బవరం-తుని మార్గాన్ని జాతీయ రహదారిగా మార్చండి.. కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రస్తుతమున్న జాతీయ రహదారికి సమాంతరంగా తుని నుంచి నర్సీపట్నం, చోడవరం మీదుగా సబ్బవరం వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా తుని – సబ్బవరం రహదారిని 4 వరుసల జాతీయ రహదారిగా మార్చాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిందని గడ్కరీకి గుర్తుచేశారు. 133 కి.మీ పొడవైన ఈ రహదారిని 4 వరుసలుగా విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ. 2,200 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి కేంద్రానికి అందజేసినట్టు వెల్లడించారు.

ఈ రహదారి నిర్మాణంతో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు లబ్ది చేకూరుతుందని, ప్రస్తుతమున్న తుని – అనకాపల్లి – విశాఖపట్నం జాతీయ రహదారి మార్గానికి సమాంతరంగా భారీ వాహనాల రద్దీని తగ్గిస్తుందని ఆయన సూత్రీకరించారు. తన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు ఈ భేటీ అనంతరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాకు చెప్పారు. తన ముందే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ)తో పాటు సంబంధిత విభాగాల ఉన్నతాధికారులను పిలిపించి మరీ ఈ అంశం గురించి మాట్లాడారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదుపరి ఢిల్లీ పర్యటనలో ఈ అంశం గురించి ప్రధానితో కూడా చర్చిస్తారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement