హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలంగాణ మేధావుల ఫోరం సభ్యులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం టీపీసీసీ చీఫ్ నివాసంలో మహేష్‌కుమార్ గౌడ్‌కు మేధావుల ఫోరం ఇందిరాగాంధీ ఎక్సలెన్సీ అవార్డు – 2024 ను ప్రధానం చేసింది.
ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నారని, వారిలో చీలికలు తేవడానికి మతతత్వ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ తదితరులు మహేష్‌కుమార్ గౌడ్‌కు శాలువ, జ్ఞాపిక ,పూలమాలతో ఘనంగా సన్మానించి అవార్డును ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రం నుంచి మహేష్‌కుమార్ గౌడ్‌ను ఎంపిక చేశామని, మున్ముందు మరిన్ని అవార్డులు ఆయన్ను వరించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ ) రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా సేవలందించారని తెలిపారు.
ఆయన పార్టీకి అందించిన సేవలకు గానూ , గత సెప్టెంబర్ 15 న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులుగా నియమించిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే తాటిపై నడిపిస్తూ అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికైమహేష్‌కుమార్ గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.