పాల్గొన్న స్పెయిన్ ప్రధాని ఫెడ్రో సాంచెజ్
21,935 కోట్లతో సైనిక విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు
గుజరాత్‌లోని వడోదరలో మోదీ, సాంచెస్ రోడ్ షో
ఆంధ్రప్రభ స్మార్ట్, ఆహ్మదాబాద్ : గుజరాత్‌లోని వడోదరలో సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సి-295 విమానాల కర్మాగారాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం కర్మాగారంలోని విశేషాలను ఎయిర్‌బస్ సంస్థకు చెందిన ఉద్యోగులు ప్రధానికి వివరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పాల్గొన్నారు. అంతకుముందు మోదీ, సాంచెజ్ కలిసి ఓపెన్ జీప్‌లో విమానాశ్రయం నుంచి టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు రోడ్ షోను నిర్వహించారు.
2022లోనే శంకుస్థాపన..
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబరులో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్‌కు 40 సి-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో ₹21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ కర్మాగారం నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్‌లో సిద్ధమవుతాయి. కాలం చెల్లిన ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనుంది.