Friday, November 22, 2024

ఎన్‌డీ టీవీలో మోజార్టీ వాటాలు అదానీకే.. ఓపెన్‌ ఆఫర్‌లో 32 శాతం షేర్ల కొనుగోలు

న్యూఢిల్లీ టీవీ ( ఎన్‌డీ టీవీ )లో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీకి మోజార్టీ వాటాలు దక్కాయి. 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ ఇచ్చిన ఆఫర్‌తో ఇన్వెస్టర్లు 53 లక్షల షేర్లు విక్రయించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న షేర్‌ విలువ కంటే చాలా తక్కువకే అదానీ ఓపెన్‌ ఆఫర్‌లో కొనుగోలు చేశారు. ధర తక్కువగా ఉన్నప్పటికీ 53 లక్షల షేర్లను అదానీ గ్రూప్‌కు ఇన్వెస్ట‌ర్లు అమ్మారు.

అయితే ఓపెన్‌ ఆఫర్‌లో మొత్తం 26 శాతం వాటాను దక్కించుకోవాలంటే 1.67 కోట్ల షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. డిసెంబర్‌ 5తో ఈ ఓపెన్‌ ఆఫర్‌ గడువు ముగుస్తుంది. శుక్రవారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌ కేవలం 53.27 లక్షల షేర్లను మాత్రమే కొనుగోలు చేసింది. అదానీ ఓపెన్‌ ఆఫర్‌లో ఒక్కో షేర్‌కు 294 రూపాయల చొప్పున కొనేందుకు ఆఫర్‌ ఇచ్చారు. శుక్రవారం నాడు ఎన్‌డీటీవీ షేర్‌ 414.40 రూపాయల వద్ద క్లోజైంది. అంతకు ముందు ఎన్‌డీ టీవీ కి ఇచ్చిన రుణాన్ని ఈక్విటీ వాటా మార్చుకున్న అదానీ 29.18 శాతం వాటా పొందారు.

- Advertisement -

అదానీ గ్రూప్‌కు షేర్లు అమ్మినవారిలో కార్పోరేట్‌ ఇన్వెస్టర్లు 39.34 లక్షల షేర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు 7 లక్షల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు 6.86 లక్షల షేర్లను విక్రయించారు. ఓపెన్‌ ఆఫర్‌లో కొనుగోలు చేసిన షేర్ల మొత్తం కలిపితే ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌కు 8.26 శాతం వాటా వస్తుంది. అంతకు ముందే తీసుకున్న 29.18 శాతం వాటాతో కలిపితే మొత్తం అదానీ గ్రూప్‌ వాటా 37.44 శాతానికి పెరుగుతుంది. ఎన్‌డీ టీవీ ప్రమోటర్లు ప్రణయ్‌ రాయ్‌, ఆయన సతీమణి రాధికా రాయ్‌లకు సంయుక్తంగా 32.26 శాతం వాటా కలిగి ఉన్నారు. ప్రస్తుతం అదానీ ఎన్‌డీ టీవీలో పెద్ద వాటాదారుగా అవతరించారు.

అదానీ ఎన్‌ డీ టీవీని టేకోవర్‌ చేసుకోవడానికి ముందు ఆర్‌ఆర్‌పీఆర్‌లో 29.18 శాతం వాటాతో కలిపి ప్రమోటర్లకు 61.45 శాతం వాటా ఉండేది. 29.18 శాతం వాటా 1.88 కోట్ల షేర్లకు సమానం. రుణాన్ని ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా అదానీ పరోక్షంగా 29.18 శాతం వాటాను టేకోవర్‌ చేశారు. ప్రస్తుతం ఎన్‌డీ టీవీలో అదానీ గ్రూప్‌ పెద్ద వాటాదారుగా మారడంతో బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను , బోర్డు ఛైర్మన్‌ను నియమించే అధికారం అదానీకి దక్కుతుంది. ప్రస్తుతం ప్రణయ్‌ రాయ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన భార్య రాధికారాయ్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రణయ్‌ రాయ్‌కి 15.94 శాతం, రాధికా రాయ్‌కు 16.32 శాతం ఉన్నందున వారు ఇద్దరూ బోర్డులో డైరెక్టర్లుగా కొనసాగుతారు. ఇప్పటికే అదానీ గ్రూప్‌ సుదీప్త భట్టాచార్య, సంజయ్‌ పుగాలియాలను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement