Friday, November 22, 2024

మహింద రాజపక్స రాజీనామా?.. శ్రీలంకలో తగ్గని నిరసనలు..

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సే సోమవారంనాడు రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అధ్యక్షుడు గొటబాయ సూచనకు మహింద సానుకూలంగా స్పందించి మెట్టు దిగడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గొటబాయ చేసిన ప్రతిపాదనలను విపక్షాలు తిరస్కరించాయి. మరోవైపు ఎమర్జెన్సీ విధించినప్పటికీ నిరసనోద్యమం చల్లారలేదు. పార్లమెంట్‌ను ముట్టడించేందుకు పెద్దఎత్తున శనివారంనాడు విద్యార్థులు రోడ్డెక్కారు. లోపల పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుందడా బయట పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మే17వ తేదీవరకు పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ప్రజలనుంచి నిరసనలు వెల్లువెత్తూండటం, ఎమర్జెన్సీ విధింపుపై తీవ్ర విమర్శలు రేగడం, ఆర్థిక సంక్షోభంనుంచి బయటపడలేని పరిస్థితుల్లో గొటబాయ రాజపక్స ప్రభుతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక పదవుల్లో గొటబాయ కుటుంబ సభ్యులు అధికారాన్ని చెలాయిస్తుండడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వారు గద్దె దిగాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం మహింద రాజీనామా చేయొచ్చన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. ఈనెల 6వ తేదీన కేబినెట్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఎమర్జెన్సీ విధింపు నిర్ణయం ఆ భేటీలోనే తీసుకున్నరు. అదే సమయంలో ప్రజాగ్రహం తగ్గాలంటే మహింద రాజపక్సే పదవినుంచి తప్పుకోవాలని కేబినెట్‌ సహచరులు, అధ్యక్షుడు అభిప్రాయపడిన నేపథ్యంలో మహింద అంగీకరించారని తెలుస్తోంది. ఆ మేరకు సోమవారం ఆయన పదవినుంచి తప్పుకుంటారని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక పత్రికల్లో కథనాలు వచ్చాయి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తమ రాజీనామాయే పరిష్కారమైతే అందుకు సిద్ధమేనని గతంలో మహింద ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆయన మాటమార్చారు. పదవినుంచి వైదొలిగేది లేదని ప్రకటించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రజాందోళనల వలన ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోందని అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు శాంతించి ఇళ్లకు చేరాలని కోరుతున్నారు. దేశానికి పెద్ద ఆదాయ వనరు పర్యాటక రంగమేనని, ప్రజలు ఆందోళనలు చేస్తూంటే విదేశాలనుంచి పర్యాటకుల రాక మందగిస్తోందని, ఆర్థికంగా దెబ్బతింటోందని అన్నారు. ఈ నేపథ్యంలో గొటబాయ కుటుంబంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. వారి కుటుంబ పాలనవల్లే దేశం అప్పులఊబిలోకి కూరుకుపోయిందని ప్రజలు భావిస్తున్నారు. కీలక పదవులున్నీ వారి గుప్పిట్లోనే ఉన్నాయని, అందరూ పదవినుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్సేతో రాజీనామా చేయించాలని అధ్యక్షుడు నిర్ణయించారు. కాగా జూన్‌లో మంత్రివర్గాన్ని పునర్యవస్థీకరించాలని అధ్యక్షుడు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement