Tuesday, November 26, 2024

Delhi | ఖర్గేను కలవడానికొచ్చి.. బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిమిషాల వ్యవధిలో పార్టీ మారి కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై అధిష్టానం పెద్దలను కలిసి తేల్చుకుంటానని ప్రకటించి ఢిల్లీ చేరుకున్న ఆయన, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. గురువారం ఒక్క రోజే కొన్ని గంటల వ్యవధిలో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. బుధవారమే ఢిల్లీ చేరుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ మొత్తం ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ను చాకచక్యంగా నడిపించారు. రాష్ట్ర నాయకత్వంలోని నేతలంగా కలసికట్టుగా వ్యవహరించి మహేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మొదలుపెట్టిన ఈ ఆపరేషన్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగించగా.. బండి సంజయ్, ఈటల రాజేందర్ దిగ్విజయంగా ముగించారు.

తరుణ్ చుగ్ నివాసం నుంచి…

గురువారం ఉదయం బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ నివాసానికి బండి సంజయ్ చేరుకుని చర్చలు ప్రారంభించారు. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప కూడా ఉన్నారు. అక్కడి నుంచే పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడి, అపాయింట్మెంట్ తీసుకున్నారు. అప్పటికే మహేశ్వర్ రెడ్డిని కలిసిన ఈటల రాజేందర్, నేరుగా అయన్ను తరుణ్ చుగ్ నివాసానికి తీసుకొచ్చారు. అక్కడి చేరుకోవడంతోనే మహేశ్వర్ రెడ్డి తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేరిట రాసిన రాజీనామా లేఖను మీడియాకు ప్రదర్శించారు. తరుణ్ చుగ్ ఎదురొచ్చి మరీ మహేశ్వర్ రెడ్డికి శాలువా కప్పి తన నివాసంలోకి ఆహ్వానించారు. అక్కడ కాసేపు చర్చించుకున్న తర్వాత నేరుగా జేపీ నడ్డా నివాసానికి బయల్దేరారు. అయితే వెళ్లే ముందు మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్న తనకు షోకాజ్ నోటీసులిచ్చే అధికారం టీపీసీసీకి లేదని, ఏదున్నా ఏఐసీసీ ద్వారానే జరగాలని అన్నారు.

- Advertisement -

పైగా నోటీసులిచ్చిన గంటలోగా తన వివరణ చెప్పాలన్నారని, పొమ్మనలేక పొగ పెట్టినట్టు తనను పార్టీ నుంచి పంపించాలన్న దురుద్దేశం, కుట్రతోనే ఇలా చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేను కలిసి తేల్చుకుందామని ఢిల్లీ వస్తే.. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేనేళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో ఎలాంటి మచ్చలేకుండా పనిచేశానని, అలాంటి తనకు పార్టీ ఇచ్చిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని, అయితే బీజేపీలో ఎప్పుడు చేరాలన్నది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. కేవలం మర్యాదపూర్వకంగా కలవడం కోసమే నడ్డా నివాసానికి వెళ్తున్నట్టు వెల్లడించారు.

నడ్డా నివాసంలో మారిన సీన్

తరుణ్ చుగ్ నివాసం నుంచి మహేశ్వర్ రెడ్డిని తీసుకుని నేతలంతా జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. అప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే నడ్డాను మర్యాదపూర్వకంగానే కలుస్తున్నట్టు చెప్పిన మహేశ్వర్ రెడ్డి అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కాషాయ కండువా కప్పుకుని బయటికొచ్చారు. తొలుత మీడియాతో తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. గంట క్రితమే రాజీనామా చేసి, ఆ వెంటనే బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. అనంతరం మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. 15 ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా పనిచేసిన తనపై సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజానికి తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ రాష్ట్ర నాయకత్వమే నిత్యం అనుమానిస్తూ, అవమానిస్తూ పార్టీ నుంచి వెళ్లగొట్టేలా వ్యవహరించిందని ఆరోపించారు. ఏ పార్టీ చరిత్రలోనూ ఎవరి విషయంలోనూ జరగనివిధంగా కేవలం తనకు మాత్రమే గంటలోపు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారని, నిజానికి షోకాజ్ నోటీసులు ఇచ్చేంత తప్పు తానేం చేశానో చెప్పాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ – బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంటులో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయని గుర్తుచేశారు. అలాగే బీఆర్ఎస్‌తో పొత్తుపై నేతలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని, తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి మరోవైపు చెబుతున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో నానాటికీ దయనీయంగా తయారవుతోందని అన్నారు.

పార్టీలో కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారని, ఈ స్థితిలో ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తెలంగాణలో నియంత పాలనను అంతం చేయగల్గిన శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఏ సైద్ధాంతిక వైరుధ్యానికి తావులేకుండా ప్రజాశ్రేయస్సు, అభివృద్ధి, అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నారని ప్రశసించారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని, త్వరలోనే తన బాటలో మరికొందరు నేతలు బీజేపీలో చేరతారని ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement