టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు తనయుడు గౌతమ్ క్రీడారంగంలో సత్తా చాటుతున్నాడు. తన వయో విభాగంలో తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. దీనిపై గౌతమ్ తల్లి నమ్రత వివరాలు తెలిపారు. గౌతమ్ తమను గర్వించేలా చేస్తున్నాడని పుత్రోత్సాహం ప్రదర్శించారు. 2018 నుంచి స్విమ్మింగ్ లో ప్రావీణ్యం కనబరుస్తున్నాడని, రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతుడైన స్విమ్మర్ గా ఎదిగాడని వివరించారు. స్విమ్మింగ్‌లో సహజసిద్ధంగా నైపుణ్యం సంపాదించడమే గాక, క్రీడలో కఠోరంగా శ్రమించడాన్ని ఆస్వాదిస్తున్నాడని తెలిపారు.
వేగానికి సరైన టెక్నిక్ ను జోడించి కచ్చితత్వాన్ని సాధించాడని తనయుడి ఘనతలను నమ్రత వెల్లడించారు. స్విమ్మింగ్ లోని నాలుగు ప్రధాన విభాగాలైన బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీస్టయిల్ అంశాల్లో ఎంతో సునాయాసంగా ఈదుతూ, అచ్చెరువొందిస్తున్నాడని తెలిపారు. అయితే, అన్నింట్లోకి గౌతమ్ కు ఫ్రీస్టయిల్ అంటే ఇష్టమని, 5 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో నిర్విరామంగా ఈదగలడని పేర్కొన్నారు.