న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రముఖ సంఘసంస్కర్త, రచయిత మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారంతా ఫూలే గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘అందరికీ అక్షరజ్ఞానం’ నినాదంతో జ్యోతిరావు ఫూలే జీవితాంతం పని చేశారన్నారు. మహిళా విద్యాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, అంటరానితనం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల్లో ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం అని కొనియాడారు.