Friday, November 22, 2024

బస్తీ దవాఖానాలకు మహర్దశ.. అనుబంధంగా రేడియోలజీ ల్యాబ్స్

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో పేదల చెంతకు ప్రభుత్వ వైద్యసేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే బస్తీ దవాఖానాల్లో అన్ని పరీక్షలను ఉచితంగా చేస్తున్న సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా దాదాపు 256 బస్తీ దవాఖానాలను తెలంగాణ ప్రభుతం ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రుల్లో నిపుణులైన ఎంబీబీఎస్‌ డాక్టర్స్‌(మెడికల్‌ ఆఫీసర్స్‌) తో పాటు స్టాఫ్‌నర్సు, సపోర్టింగ్‌ స్టాఫ్‌తో పాటు ఇటీవలనే ఎన్‌సీడీ స్టాఫ్‌ నర్సులను కూడా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకుని వైద్య సేవలందిస్తున్నారు. టీ డయాగ్నసిస్‌ ద్వారా సుమారు 57 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా పాము, కుక్కకాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులను ప్రభుత ఆస్ప్రత్తుల్లో అందుబాటులో ఉంచినట్లు ఇటీవల మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఇలా బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల పరీక్షలను పేదల ముందుకు తీసుకొచ్చిందని వైద్యారోగ్యశాఖ సైతం చెబుతోంది. వీటన్నింటికి తోడు కొత్తగా బస్తీదవాఖానాల్లో రేడియోలజీ ల్యాబ్స్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని మంత్రి వెల్లడించారు.

బస్తీ దవాఖానా పనివేళ్లలో మార్పులు..

బస్తీ దవాఖానా పనివేళ్లలో భారీ మార్పులు చేసినట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జె.వెంకటి, బస్తీ దవాఖానా హైదరాబాద్‌ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రుక్మారెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలనే వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌(తెలంగాణ ప్రభుత్వం) సంయుక్తంగా బస్తీ దవాఖానాల పనితీరుపై గత నెల 23న సమీక్షించిందని చెప్పారు. ఇందులో భాగంగా ఇంకా మెరుగైన సేవలందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఇక నుంచి బస్తీ దవాఖానాలు ఆదివారం రోజుల్లో కూడా పని చేస్తాయని తెలిపారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు కూడా పని చేస్తాయని వెల్లడించారు. ప్రతి శనివారం రోజు మాత్రం బస్తీ దవాఖానాలు బంద్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఈ నిబంధనలను హైదరాబాద్‌ జిల్లాతో పాటు శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాల్లో నెలకొల్పబడిన బస్తీ దవాఖానాలకు మాత్రమే వర్తిస్తాయని వారు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement