Saturday, November 16, 2024

Maharastra – మోదీకి ఓటేస్తే మహారాష్ట్ర అధోగతే..! ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి

అధికారంలోకి రాగానే తెలంగాణ గ్యారెంటీ పథకాలు అమలు

  • మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులం మేమే..
  • చంద్రాపూర్ , రాజూరా ఎన్నికల సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో: మహారాష్ట్రలో మహా వికాస్ ఆగాడి కూటమిని గెలిపిస్తే తెలంగాణలో అమలవుతున్న ఆరు గ్యారెంటీ పథకాలను పక్కా అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న చంద్రపూర్ జిల్లా చంద్రాపూర్, రాజురా ప్రచార సభల్లో సీఎం పాల్గొన్నారు. అదానితో కలిసి ప్రధాని మోదీ వాణిజ్య నగరమైన ముంబై ప్రాంతాన్ని దివాలా తీశారని ఆరోపించారు. ముంబై మురికివాడల్లో కార్మికులు, కూలీలు దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

- Advertisement -

శివాజీ, అంబేడ్కర్ అసలు వారసులం మేమే..!
దివంగత శివసేన అధిపతి, మరాఠా యోధుడు చత్రపతి శివాజీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కన్నకలలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కూటమి ముందుంటుందన్నారు. బాల్ టాక్రే పార్టీకి మోసం చేసి వెన్నుపోట్లతో శివసేన ను చీల్చి బీజేపీతో జత కట్టిన సీఎం ఏక్​నాథ్​ షిండేను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ.. గుజరాత్ 20 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శివాజీ, అంబేద్కర్ అసలు వారసత్వ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మరొకసారి బీజేపీ కూటమిని గెలిపిస్తే ముంబైతో పాటు మహారాష్ట్ర అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.

రుణమాఫీ, ఉద్యోగ కల్పనలో మేమే బెస్ట్
తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతుల ఖాతాలో జమ చేశామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం అన్నారు. మహారాష్ట్ర సీఎంకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, ముంబై వేదికగా తాను వస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆడపడుచులందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఇప్పటికే రూ 3,600 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు.

కేసీఆర్ అడ్రస్ లేకుండా పోయిండు..
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలను మోసం చేసిన కేసీఆర్ లేకుండా పోయిండని సీఎం రేవంత్ అన్నారు. వేలకోట్ల ప్రజా సొమును డ్యూటీ చేసిన ఘనత కేసీఆర్​కి దక్కిందని, ఆయనను ఇప్పుడు ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిపిస్తే 6 గ్యారంటీ పథకాలు పక్కా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాజుర అభ్యర్థి సుభాష్ గోటెను గెలిపించాలని కోరారు.

అహ్మద్ నగర్​లో సీతక్క..
మహా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు నేతలు మహారాష్ట్రలో తిష్ట వేశారు. మంత్రి ధనసరి సీతక్క అహ్మద్​నగర్, షిరిడీలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొనగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాందేడ్ జిల్లా బోకర్, నయాగావ్, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడెం నగేష్ చంద్రాపూర్ జిల్లాలో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ నేతలతో సరిహద్దు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార ఘట్టం వేడెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement