మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి..
ఇప్పటి వరకు విడుదలైన సర్వేలలో ఒక్క దైనిక్ భాస్కర్ మినహా అన్ని బీజేపీ కూటమి కే మళ్ళీ అధికారం అని తేల్చి చెప్ప్పాయి.
జాతీయ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ సంచలన అంచనాలను విడుదల చేసింది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా దైనిక్ భాస్కర్ రిపోర్టర్ల ఎగ్జిట్ పోల్ ఈసారి మహారాష్ట్రలో అధికారం విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిదే అని తేల్చిచెప్పేసింది..మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగినా ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ గెలబోతున్నట్లు తేల్చింది.
ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమికి 130 నుంచి 150 సీట్లు లభించే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.అలాగే బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమికి 125 నుంచి 140 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. ఇతరులకు మరో 20 నుంచి 25 సీట్లు వస్తాయని తెలిపింది.
పీ-మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదలయ్యాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారం దక్కించుకునే అవకాశాలున్నాయని ఈ సర్వే తేల్చింది. అయితే, ఇండియా కూటమి గట్టిపోటీనిస్తుందని పేర్కొంది.
:ఓటర్ల నాడి ఏం చెబుతోంది..?పీ-మార్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 288 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార కూటమికి 137 నుంచి 157 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక్కడ మెజారిటీ మార్క్ 145 ఉంది.ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) 126, 146 స్థానాల మధ్య గెలుస్తుందని అంచనా వేయగా.. చిన్న పార్టీలు, స్వతంత్రులు 2 నుంచి 8 స్థానాలను దక్కించుకుంటారని తెలిపింది. మహాయుతికి 42 శాతం ఓట్లు రావచ్చని, ఎంవీఏకు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇతరులకు 17 శాతం లభిస్తుందని అంచనా వేసింది.
అధికార మహాయుతి కూటమికి 175 నుంచి 196 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన యూబీటీతో కూడిన మహా వికాస్ అఘాడీకి కేవలం 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 113 సీట్లు, శివసేన షిండే వర్గానికి 52 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 17 సీట్లు వస్తాయని ఈ పోల్ అంచనా వేసింది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ కు 35 సీట్లు, శరద్ పవార్ ఎన్సీపీకి 35 సీట్లు, ఉద్దవ్ సేనకు 27 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
మహాయుతి కూటమికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమికి కేవలం 110 నుంచి 130 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
ఫాలొది సట్టా బజార్ తన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఇది. మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపింది. ఈ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని పేర్కొంది. 150 నుంచి 170 నియోజకవర్గాల్లో మహాయుటి జెండా రెపరెపలాడుతుందని సట్టా బజార్ అభిప్రాయపడింది.మహా వికాస్ అఘాడి కూటమికి ఈ సారి కూడా పరాభవం తప్పకపోవచ్చనేది సట్టా బజార్ అంచనా. దీని ప్రకారం చూసుకుంటే ఈ ధఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందీ కూటమి. వికాస్ అఘాడీకి 110 నుంచి 130 వరకు సీట్లు దక్కొచ్చని పేర్కొంది. ఇతరులు 8 నుంచి చోట్ల విజయం సాధిస్తారని తెలిపింది.
చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూడా ఇలాంటి అంచనాలనే వెలువడించింది. మహాయుటి వైపే మొగ్గు చూపింది. ఈ కూటమి హవా వీస్తుందని అంచనా వేసింది. 152 నుంచి 160 నియోజకవర్గాల్లో జెండా పాతుతుందని పేర్కొంది. ఇందులో కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది.మహా వికాస్ అఘాడి కూటమికి ఈ సారి కూడా పరాభవం తప్పకపోవచ్చని చాణక్య పేర్కొంది. ఈ ధఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందీ కూటమి. వికాస్ అఘాడీకి 130 నుంచి 138 వరకు మాత్రమే సీట్లు దక్కొచ్చని పేర్కొంది, అధికారాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కు అతి సమీపంలో ఆగిపోతుందని తెలిపింది. ఇతరులు 6 నుంచి 8 చోట్ల విజయం సాధిస్తారని తెలిపింది.
మహాయుతి కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా, 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది శివసేన(ఏక్‌నాథ్ షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(అజిత్ పవార్) 59 స్థానాల్లో పోటీ చేసింది.
మరోవైపు, MVA కూటమిలో కాంగ్రెస్ నుంచి 101 మంది అభ్యర్థులు, శివసేన (ఉద్ధవ్ థాక్రే) నుంచి 95 మంది, NCP (శరద్ పవార్) నుంచి 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.