Saturday, November 23, 2024

Maharastra – బీజేపీ కూటమికి మహా విజయం – కాంగ్రెస్ కూట‌మికి శృంగ‌భంగం

మహాయుతిదే మ‌ళ్లీ అధికారం
288 సీట్లున్న అసెంబ్లీలో 228 స్థానాల్లో గెలుపు
149 చోట్ల పోటీ.. 132 సీట్లు గెలుచుకున్న బీజేపీ
అజిత్, ఏక్‌నాథ్‌ షిండే పార్టీలకు రికార్డు విజయాలు
మహా వికాస్‌ అఘాడీ కూట‌మికి ఘోర పరాభవం
మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 47 స్థానాలకే పరిమితం
101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. దక్కింది 16 సీట్లే
థాక‌రే శివసేన, శరద్ పవార్ పార్టీల‌కు భంగ‌పాటు
ప్ర‌ధాని మోదీ హామీలకు మరాఠ జ‌నం ఆమోదం
గేమ్ చేంజర్‌గా మారిన రైతు రుణమాఫీ, లడ్‌కీ బెహన్ పథకాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ముంబ‌యి: ముంబై – మహారాష్ట్రలో మహాయుతి కూటమి సంచలన విజయం నమోదు చేసింది. ఊహించని విధంగా ఏకపక్షంగా గెలుపు సాధించి రెండోసారి అధికారం పీఠాన్ని కైవసం చేసుకుంది. తమదే గెలుపు అని ఆశలు పెట్టుకున్న ఎంవీఏ కూటమిని మరాఠా ప్రజలు తిరస్కరించారు. నామ మాత్రపు సీట్లకు పరిమితం చేసారు. కాంగ్రెస్ కు బాగా ప‌ట్టున్న విద‌ర్భంలో హ‌స్తం పార్టీకి రిక్త‌హ‌స్తాలే మిగిలాయి. ఇక షుగ‌ర్ బెల్ట్ లో బిజెపి బ‌లంగా ఉన్న శ‌ర‌ద్ ప‌వ‌ర్ ఎన్సీపికి చుక్క‌లు చూపింది.. ఇక ముంబైలోనూ, చుట్టు ఉన్న అర్బ‌న్ ప్రాంతాల‌లో థాక్రే శివ‌సేన‌కు ఎదురు దెబ్బ‌లే త‌గిలాయి.. గ‌తం కంటే ఎంవిఎ కూట‌మి 60 శాతం స్థానాలు త‌గ్గాయంటే బిజెపి హ‌వా ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన ఏక్‌నాథ్ షిండే పార్టీ 81, ఎన్​సీపీ అజిత్‌ పవార్‌ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలోని కాంగ్రెస్‌ 101, శివసేన-యూబీటీ 95, ఎన్​సీపీ-ఎస్పీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఇక శ‌నివారం కౌంటింగ్ జ‌రుగుతుండ‌గా..ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన ఫ‌లితాల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 132 చోట్ల‌, శివసేన షిండే పార్టీ 55 స్థానాలు, అజిత్ ప‌వార్ ఎన్‌సీపీ 41 చోట్ల విజ‌యం సాధించాయి. మొత్తమ్మీద బీజేపీ కూట‌మి 228 స్థానాల‌ అధీక్యంలో కొన‌సాగుతోంది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలోని కాంగ్రెస్ 16, శివసేన-యూబీటీ 21, ఎన్​సీపీ-ఎస్పీ 10 స్థానాల్లో అధీక్యంలో ఉన్నాయి.. ఈ కూట‌మి 47 స్థానాల‌కు ప‌రిమితం కానున్న‌ట్లు ఓట్ల లెక్కింపు స‌ర‌ళిని బ‌ట్టి తెలుస్తోంది.. కాగా, ఎంఐఎం రెండు సీట్ల‌లో పాగా వేసింది. మ‌రో 11 చోట్ల ఇత‌రులు అధీక్యంలో కొన‌సాగుతున్నారు.

- Advertisement -

మ‌హాయ‌తి విజ‌యంలో..

మహాయుతి విజయం వెనుక ఓబీసీ అంశం బలంగా పని చేసింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అదే విధంగా బీజేపీ నేతల ప్రచారంతో వారు ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రజల్లోకి వెళ్లాయి. సమిష్టిగా మహాయుతి నేతలు పని చేయటమే విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పక్కా వ్యూహాత్మకంగా మహారాష్ట్రలో మహుయుతి కూటమి అఖండ విజయం సాధించింది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 220 పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలకు అనుగుణంగా కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. ఎన్నికల్లో గెలివాలంటే కీలకమైన మరాఠా, మహిళా, యువత, ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పని చేసాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

రైతు రుణ మాఫీ గేమ్ చేంజ‌ర్..

ఎంవీఏ కూటమి హామీలిచ్చినా..అమలు చేస్తున్న మహాయుతి వైపే ప్రజలు మొగ్గు చూపించారు. మహుయుతి విజయం వెనుక ఈ ఎన్నికల్లో ఇప్పటికే అమలు చేస్తున్న లడ్‌కీ బెహన్‌ పథకం మొత్తాన్ని పెంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 15వందలుగా ఉన్న ఈ పథకం లబ్ది మొత్తం తాము అధికారంలోకి వస్తే 2, 100కి పెంచారు. ఈ పథకం కింద మహిళలకు మూడు నెలల మొత్తాన్ని ముందుగానే ఇచ్చారు. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ రూ.15 వందల నుంచి రూ. 2,100కి పెంచుతామన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజ‌ర్‌గా మారింది. ఇక.. రైతులకు షెట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా రూ.15వేలు ఇస్తామని కూట‌మి హామీ ఇచ్చింది. రైతులు, మహిళలతో పాటు విద్యార్ధులకు హామీలు గుప్పించింది. విద్యార్థులకు 25లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేల ఇస్తామ‌న్న హామీలు పని చేసాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement