Tuesday, November 19, 2024

Maharashtra – సిద్దికి హ‌త్య‌… అధికార కూట‌మిలో వ‌ణుకు

ఎన్నిక‌ల వేళ అధికార పార్టీ నేత దారుణ హ‌త్య‌
బిజెపి, ఎన్ సిపి పై విరుచుకుప‌డుతున్న విప‌క్షాలు
మ‌హారాష్ట్ర శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ప్ర‌శ్న‌లు

ముంబ‌యి – ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది మహారాష్ట్ర. జార్ఖండ్‌తో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉందిక్కడ. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఇంకో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఎన్నికల ముంగిట్లో మహారాష్ట్ర రాజకీయాల్లో సునామీ పుట్టించింది. అధికారంలో ఉన్న శివసేన- భారతీయ జనతా పార్టీ- ఎన్సీపీ కూటమి ఆత్మరక్షణలో పడింది.

- Advertisement -

అన్ని రాజకీయ పార్టీలు సిద్ధిక్ హత్యోదంతం పట్ల స్పందించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సమాజ్‌వాది పార్టీ, ఏఐఎంఐఎం, ఆయా పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు – సంకీర్ణ కూటమి సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నాయి. ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తుతున్నాయి.

సిద్ధిక్ హత్యపై పారదర్శకంగా విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నానా పటోలే, ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివర్ డిమాండ్ చేశారు. సిద్దిక్ వంటి సీనియర్ నాయకుడికి సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

బాబా సిద్ధిక్ హత్య తనను తీవ్రంగా కలచివేసిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, మహారాష్ట్ర నేత వారిస్ పఠాన్ అన్నారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో క్షీణించాయనే విషయాన్ని ఈ ఉదంతం అద్దం పట్టిందని వ్యాఖ్యానించారు.

పాలనపై కూటమి ప్రభుత్వం పూర్తి పట్టు కోల్పోయిందని, ముంబై వంటి మహానగరంలో బాబా సిద్ధిక్‌పై కాల్పులు జరపడమే దీనికి నిదర్శనమని ఎన్సీపీ నేత శరద్ పవార్, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే మండిపడ్డారు. ఆర్థిక రాజధానిలో ఓ మాజీ మంత్రి ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు కుప్పకూలాయంటూ విమర్శించారు.

ఈ పరిణామాలతో మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర పడ్నవిస్, అజిత్ పవార్.. సమీక్ష నిర్వహించారు. సిద్ధిక్‌ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన ఒక నిందితుడి కోసం పోలీసుల జ‌ల్లెడ ప‌డుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement