ముంబయి – మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 288 నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.తొలి గంటలోనే గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిల్చోవడం కనిపించింది.
హీరోలు, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావ్, ఫజల్ అలీ, దర్శకుడు కబీర్ ఖాన్.. తొలి గంటలోనే ఓటువేసిన వారిలో ఉన్నారు.బారామతిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సులే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కుటుంబంతో సహా పోలింగ్ కేంద్రానికి వచ్చారామె. భర్తతో, పిల్లలతో కలిసి ఓటు వేశారు. మహా వికాస్ అఘాడీ కూటమి గెలుపు ఖాయమైందని, తాము కీలకంగా వ్యవహరించబోతోన్నామని చెప్పారు..
టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య అంజలి టెండుల్కర్, కుమార్తె సారా టెండుల్కర్తో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారాయన. సారా టెండుల్కర్ ఓటు వేయడం ఇదే తొలిసారి.ఓటు వేసిన వారిలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ దంపతులు ఉన్నారు.
పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన బూత్‌కు వచ్చారు. ఆ సమయంలో క్యూలైన్ లేకపోవడంతో నేరుగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఓటు వేశారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడంలో అలసత్వం వహించకూడదని పేర్కొన్నారు.
ఓటర్లు కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని శక్తికాంత దాస్ కితాబిచ్చారు. ఈసీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.