హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి భారీ స్పందన వస్తోంది. ఉచిత ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 24 .05 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, నాన్-లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి జీరో టికెట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక, గ్రామీణ మహిళలకు ఈ పథకం వరంగా మారింది.
ప్రయాణానికి వెళ్లడానికి ఖర్చు చేసిన డబ్బును ఇప్పుడు ఆదాచేస్తూ తమ కుటుంబ అవసరాలకు వెచ్చిస్తున్నారు. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, 2023న ప్రారంభించిన తర్వాత జనవరి నెలలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 28.10 లక్షలకు పెరిగింది. ఫిబ్రవరి నెలలో రోజువారీగా 30.56 లక్షలకు పెరిగింది. ఈ మార్చి నెలలో రోజుకు దాదాపు 32 లక్షల మంది ప్రయాణించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2404.65 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. అంటే ఇప్పటివరకు 24.05 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.