Friday, September 6, 2024

Big Story | మహాద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు.. వాటర్‌ హబ్‌గా మిడ్‌మానేరు

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి, మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశారు. గోదావరిపై లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజులను నిర్మించి, వంద కిలోమీటర్లకు పైగా గోదావరిని జలధారగా మార్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా మార్చడమే కాకుండా, మధ్యమానేరు (ఎస్సారార్‌) నుంచి ఎగువమానేరు వరకు.. అలాగే దిగువమానేరు ప్రాజెక్టు ద్వారా కాకతీయ కాలువ చివరి ఆయకట్టు వరకు.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రతి చెరువునూ, కుంటనూ నింపారు. తద్వారా భూగర్భజలాలు పెరగడమే కాదు, సాగునీటి సమస్య తీరింది. సాగునీటి రంగంలో ఉమ్మడి జిల్లా ముఖ చిత్రం పూర్తిగా మారింది.

ఇప్పుడు శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌ మానేరు) వాటర్‌ హబ్‌లా మారింది. కేసీఆర్‌ కలల ప్రాజెక్టు కాళేశ్వరం లాంటి అతి భారీ ఎత్తిపోతల పథకాన్ని కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేయడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తనకుతానే సాటి అని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇంజనీరింగ్‌ అద్భుతంగా పేరుగాంచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మూడు బ్యారేజీలు, 20 మెగా నీటి లిప్ట్‌nలు, 21 పంపుహౌజ్‌లు, 180 రిజర్వాయర్లతోపాటు 1832 కి.మీ. పొడవునా సొరంగ మార్గాలు, పైపులైన్లు, కెనాళ్లను నిర్మించారు.

మూడు సంవత్సరాల వ్యవధిలో అతి భారీ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పిందంటే అతిశయోక్తి కాదు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకానికి కూడా కాళేశ్వరం జలాలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం రివర్స్‌ పంపింగ్‌ అనే వినూత్న విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం 100 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైతులు చెల్లించాల్సి ఉన్న నీటితీరువా పన్ను బకాయిలను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం రద్దు చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసం సమస్యలను పరిష్కరించి, రాయపట్నం బ్రిడ్జ్‌ని నిర్మింపజేసి 20 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సాధించగలిగాం.

- Advertisement -

ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా 25 వేల ఎకరాలకు, చెరువులను నింపినందున మరో 37,000 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. 2016లో ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి రెండవ దశ కాలువల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాలకు నీటిని తరలించి వందలాది చెరువులను నింపడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 జిల్లాల్లో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్‌ నగరానికి నీటి సరఫరాకు 30 టీఎంసీలు, దారి పొడవునా ఉన్న గ్రామాల తాగునీటికి 10 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు వినియోగించనున్నారు. ప్రపంచంలో అతి ఎత్తయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేయడం ప్రపంచ రికార్డే. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును 1955లో నిర్మాణం ప్రారంభిస్తే 1967లో పూర్తి చేశారు.. 12 సంవత్సరాల కాలం పట్టింది.

అలాగే శ్రీశైలం ప్రాజెక్టును 1960లో ప్రారంభిస్తే 1981లో పూర్తి చేశారు.. 21 సంవత్సరాల కాలం పట్టింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును 1963లో ప్రారంభిస్తే 1977లో పూర్తి చేశారు.. 14 సంవత్సరాల కాలం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టును 2016 మే 2న ప్రారంభిస్తే 2019న పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసే మార్గం పొడవు 1832 కిలోమీటర్లు, వాలు కాలువ పొడవు 1531 కిలోమీటర్లు, వాలు టన్నల్‌ పొడవు 203 కిలోమీటర్లు, ప్రెషర్‌ పైపులైను పొడవు 98 కిలోమీటర్లు. మొత్తం లిఫ్టులు 20లు ఉన్నాయి. లిఫ్టులకు గాను 4627.24 మెగా వాట్ల విద్యుత్‌ అవసరం, అవసరమయ్యే శక్తి 13558 మిలియన్‌ యూనిట్లు. పాత జలాశయాలు కాళేశ్వరం పరిధిలో 5 ఉండగా, కొత్తగా 29 జలాశయాలు నిర్మిస్తున్నారు.

జలాశయాల నిల్వ సామర్థ్యం 147.71 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వివిధ జలాశయాల నుంచి 18,25,700 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. గోదావరిపై మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం వరకు మూడు బ్యారేజీలు, మూడు పంప్‌లు, ఆయకట్టు 30వేల ఎకరాలు. ఎల్లంపల్లి జలాశయం నుచి మిడ్‌మానేరుకు 6, 7, 8 ప్యాకేజీలు నిర్మించారు. మిడ్‌మానేరు నుంచి అప్పర్‌ మానేరు జలాశయం వరకు 9వ ప్యాకేజీ ద్వారా పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. 86,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మిడ్‌మానేరు నుంచి సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ జలాశయం వరకు ప్యాకేజీ 10, 11, 12, 13, 14 పూర్తి దశకు చేరుకున్నాయి. మొత్తం, స్థిరీకరించిన ఆయకట్టు 5,95, 754 ఎకరాలు.

కాళేశ్వరం క్రింద జిల్లాల్లో బ్యారేజీలు

  • ప్రతిపాదిత జలాశయాలలో ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి 100 మీ. ఎఫ్‌ఆర్‌ఎల్‌తో జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా (పూర్వ కరీంనగర్‌ జిల్లా) మహాదేవపూర్‌ మండలం ఆబటటిపల్లి వద్ద నిర్మించారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు.
  • జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా (పూర్వ కరీంనగర్‌ జిల్లా) మహాదేవపూర్‌ మండలం అన్నారం వద్ద 119 మీ. ఎఫ్‌ఆర్‌ఎల్‌తో అన్నారం బ్యారేజీని నిర్మించారు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలు.
  • పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం సుందిళ్ల వద్ద 130 మీ. ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల బ్యారేజీని నిర్మించారు. ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 8.83 టీఎంసీలు. జగిత్యాల జిల్లా మోతే జలాశయంను 1.50 టీఎంసీలు నిల్వ ఉండే విధంగా నిర్మించారు.
  • పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద 0.78 టీఎంసీల సామర్థ్యంతో మేడారం బ్యారేజీని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో అనంతగిరి జలాశయంను నిర్మించారు.
    ప్రాజెక్టుల్లో నీటి లభ్యత – వినియోగం
  • గోదావరి నుంచి 180 టీఎంసీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు 20 టీఎంసీలు, ఆన్‌లైన్‌ చెరువుల పరివాహక ప్రాంత నీటి లభ్యత 10 టీఎంసీలు, ఆయకట్టు ప్రాంతాలలో భూగర్భ జలాల రీచార్జీ ద్వారా 25 టీఎంసీలు కలుపుకొని మొత్తం 235 టీఎంసీలు కాగా, ఆవిరి నీరు 10 టీఎంసీలు తీసివేస్తే 225 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది.
  • నీటి వినియోగం విషయంలో కొత్త ఆయకట్టుకు సాగునీరు 134.5 టీఎంసీలు, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల స్థిరీకరణ 18.82 లక్షల ఎకరాలు కాగా, 25 శాతం నీటి కొరతను పరిగణించి వీటి అవసరాలకు 34.5 టీఎంసీల నీటిని, హైదరాబాద్‌ నగరానికి 30 టీఎంసీలు, దారిపొడవునా గ్రామాలకు 10 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు, మొత్తంగా 225 టీఎంసీల నీటి అవసరాలను గుర్తించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement