Thursday, November 21, 2024

మ్యాజిక్‌ షోలు, యోగాసనాలు.. రాజస్థాన్‌ శిబిరాల్లో కొత్త ర‌కం సీన్లు.. రసపట్టులో రాజ్యసభ ఎన్నికలు

న్యూఢిల్లి : రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ శిబిరాల్లో సరికొత్త దృశ్యాలు ఆవిష్కారమవుతున్నాయి.
బీజేపీ గాలం వేయకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలనందరినీ జైపూర్‌లోని ఉదయ్‌పూర్‌ రిసార్టులోని శిబిరంలో దాచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే వారు ఎటూ జారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధిష్టానం.. కాలక్షేపం కోసం పెద్ద ఏర్పాట్లే చేసింది. ప్రఖ్యాత మెజీషియన్‌ జాదూగర్‌ అంచల్‌ ఆధర్యంలో మేజిక్‌ షో నిర్వహించారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సహా సతహాగా మెజీషియన్‌ అయిన గెహ్లాట్‌ తండ్రి కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రాత్రి డిన్నర్‌ చేస్తూ ఈ షో చూస్తున్నవారంతా ఉల్లాసంగా ఆ షోలో పాల్గొన్న వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్‌ 10న రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండగా ఈనెల 2నే తమ ఎమ్మెల్యేలతోపాటు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల శాసనసభ్యులను జైపూర్‌ రిసార్టుకు తరలించారు. పన్నెండుమంది ఇండిపెండెంట్లతోసహా 100మంది శాసనసభ్యులు రిసార్టులో ఉన్నారు. కాగా తమకు 123మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారిలో 12మంది ఇండిపెండెంట్లు, ఇద్దరు సీపీఎం శాసనసభ్యులు ఉన్నారని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.నిజానికి రాజ్యసభ స్థానాల్లో నెగ్గాలంటే మరో ముగ్గురు శాసనసభ్యుల ఓట్లు అవసరం. భారతీయ ట్రైబల్‌ పార్టీ సభ్యులు తమకు మద్దతు ఇస్తారన్న ఆశతో కాంగ్రెస్‌ ఉంది. రాజస్థాన్‌లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 108మంది సభ్యులున్న కాంగ్రెస్‌ రెండు స్థానాలను సులువుగానే గెలుచుకోగలదు. మొదటి రెండు సీట్లు గెలుచుకున్నాక, ఇంకా 26మంది ఎమ్మెల్యేల ఓట్లు మిగిలి ఉంటాయి. మూడో సీటును గెలుచుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేలు ఓటువేయాలి. అంటే ఇంకో 15మంది సభ్యుల మద్దతు అవసరం. మిగతా సభ్యుల మద్దతు కూడగట్టేందుకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సూర్జేవాలా, ప్రమోద్‌ తివారి రాజస్థాన్‌లో పావులు కదుపుతున్నారు.

బీజేపీ శిబిరంలో యోగా.

ఇక బీజేపీ శిబిరంలో మరోరకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అక్కడ సేదదీరుతున్న శాసనసభ్యులు యోగాలో శిక్షణ పొందుతున్నారు. ఆసనాలు వేస్తూ కన్పించారు. రాజస్థాన్‌ శాసనసభలో బీజేపీకి 71మంది సభ్యులున్నారు. ఒక స్థానంలో విజయం ఖాయం. ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. రెండో స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.అందులోభాగంగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీడియా దిగ్గజం సుభాష్‌ చంద్రకు బహిరంగ మద్దతు ప్రకటించింది. ఒకప్పటి ఎన్‌డీఏ మిత్రపక్షం లోక్‌ తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ)కి ముగ్గురు శాసనసభ్యులున్నారు. వారంతా సుభాష్‌కు మద్దతు ప్రకటించారు. ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీ సులువుగా నెగ్గుతుంది. మొత్తం 71 ఎమ్మెల్యేల ఓట్లలో మొదటి స్థానానికి కొన్ని పోగా 30 ఓట్లు మిగులుతాయి. అవి సుభాష్‌ చంద్రకు వేస్తారు. బీజేపీ, ఆర్‌ఎల్‌పీ ఓట్లు సుభాష్‌ చంద్రకు పడినప్పటికీ గెలవాలంటే మరో మరో 8మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ, సుభాష్‌ చంద్ర తమ ఎమ్మెల్యేలను లాగేస్తారేమోనన్న భయంతో కాంగ్రెస్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement