మామూలుగా మనుషులకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.. ఊపిరి ఆడని అత్యవసర సమయాల్లో సీపీఆర్ చేస్తుండటం చాలా చూశాం. అయితే.. పాముకు సీపీఆర్ అంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడిచే విషయమే. మధ్యప్రదేశ్ సెమ్రీ హర్‌చంద్‌లోని తవా కాలనీలోకి ఓ పాము దారి తప్పి వచ్చింది. అయితే.. ఆ పాము నీటి పైప్‌లైన్‌లో చిక్కుకుంది. భయపడి బయటకు రాలేదు. దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు పురుగుల మందు కలిపిన నీటిని పైప్‌లైన్‌లో పోశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ వెంటనే అక్కడికి చేరుకున్నాడు.
పురుగుల ముందు నీటిని తీసుకున్న పాము అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత దాని శరీరంపై ఉన్న పురుగుల మందు పోవడానికి మంచి నీటిని చల్లారు. ఆ తర్వాత దాన్ని బతికించేందుకు ఆ కానిస్టేబుల్ సాహసమే చేశాడు. ఏకంగా పాము నోటికి తన నోరుని పెట్టి ఊపిరి అందించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అతడు సీపీఆర్ ఇస్తుండగా పాము కదలడం ప్రారంభించింది. వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.