Sunday, November 24, 2024

Delhi | నాణ్యతాలోపంతోనే మేడిగడ్డ ప్రమాదం.. మండిపడ్డ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నాణ్యతాలోపం కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆరోపించింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. చిన్న ఇల్లు కట్టుకున్నా ఇంజనీర్లను ఆశ్రయించి డిజైన్ రూపొందించుకుంటామని, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ తానే ఇంజనీర్ అవతారమెత్తి డిజైన్లు మార్చారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

సాంకేతిక నిపుణులతో చేయించాల్సిన పనిని సక్రమంగా చేయించకపోవడం వల్లనే ఇంత భయంకరంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి పెద్ద గుదిబండలా మారనుందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని భట్టి విక్రమార్క అన్నారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని దుయ్యబట్టారు.

కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమని, నాణ్యతాలోపం వల్ల మేడిగడ్డ ప్రమాదం జరిగిందని విమర్శించారు. రూ. లక్ష కోట్లు కేసీఆర్, కాంట్రాక్ట్రర్లు కలిసి దోచుకున్నారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి, గవర్నర్, కేంద్ర ఎన్నికల కమిషన్ సంస్థలు ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని అన్నారు.

మేడిగడ్డకు వెళ్లేందుకు ఈసీకి లేఖ రాస్తామని, కేటీఆర్, హరీశ్ రావు తమతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్రాధ్యక్షులు కిషన్ రెడ్డి మేడిగడ్డలో పర్యటించాలని అన్నారు. ప్రైవేట్ కంపెనీలు నిర్మించాయని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. సంఘవిద్రోహ శక్తుల ప్రమేయం ఉందా లేక మానవ తప్పిదం కారణంగా జరిగిందా అన్నది దర్యాప్తు జరపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement