Friday, November 22, 2024

రంజీ ట్రోఫీ విజేతగా మధ్యప్రదేశ్‌.. ఫైనల్‌లో ముంబై చిత్తు

బెంగళూరు: మధ్యప్రదేశ్‌ జట్టు దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ముంబైతో జరిగిన ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ట్రోఫీని అందుకోవాలనే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 2022 సీజన్‌ విజేతగా నిలిచి, తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించింది. 41సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టుకి ఫైనల్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ షాకిచ్చింది. 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 1998-99 రంజీ సీజన్‌లో చంద్రకాంత్‌ పండిట్‌ కెప్టెన్సీలో రన్నరప్‌గా నిలిచిన మధ్యప్రదేశ్‌, 23 ఏళ్ల తర్వాత అదే చిన్నసామి స్టేడియంలో ముంబైతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది. రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి ఇదే మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 374 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్‌ 536 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 113/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. సువేద్‌ పార్కర్‌ 51 పరుగులతో టాప్‌ స్కోర్‌గా నిలవగా, సర్పరాజ్‌ ఖాన్‌ (450, పృథ్వీషా (44) రాణించారు. మధ్యప్రదేశ్‌ బౌలర్‌ కుమార్‌ కార్తికేయ 4 వికెట్లు పడగొట్టగా, గౌరవ్‌ యాదవ్‌, పార్థ్‌ సహాని చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది.

Ranji Trophy 2021-22, Final: Madhya Pradesh Win Maiden Title - Stats  Highlights

హిమాన్షు మాంత్రి (37), శుభమ్‌ శర్మ (30), రజత్‌ పటిదార్‌ (30) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో 122.75 సగటుతో 982 పరుగులు చేసిన ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌కు ”మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌” దక్కగా, శుభ్‌మన్‌ శర్మకు ”ఫ్లేయర్‌ ఆఫ్‌ ది ఫైనల్‌” దక్కింది. 1998-99లో మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ రన్నరప్‌గా నిలువగా, 23ఏళ్ల తర్వాత అదే చంద్రకాంత్‌ పండిట్‌ కోచ్‌ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేజిక్కించుకోవడం విశేషం. ఫైనల్‌లో ముంబైపై అద్వితీయమైన విజయాన్ని నమోదు చేసుకున్న సమయంలో కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేడియంలోనే కన్నీటి పర్యంతమయ్యాడు. గమనించిన క్రికెటర్లు కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ను తమ భుజాలపై ఎక్కించుకుని మైదానంలో కలియదిరిగారు. మధ్యప్రదేశ్‌ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో చాలా సంతోషంగా ఉందని, మాటల్లో చెప్పలేనని కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement