రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు పట్టు బిగించింది. ఓపెనర్ యశ్ దూబే, శుభమ్ శర్మలు సెంచరీలతో కదంతొక్కగా, రాజత్ పాటిదార్ అర్దసెంచరీతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది. ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా, 374 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. యశ్ దూబే 44, శుభమ్ శర్మ 41 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించగా, ఇద్దరూ సమయోచితంగా ఆడుతూ సెంచరీలు నమోదు చేసుకున్నారు. శుభమ్ శర్మ అవస్థి బౌలింగ్‌లో అవుట్‌సైడ్ వెళ్తున్న బంతిని ఆడబోయి, కీపర్ టమోరేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
దీంతో శుభమ్ శర్మ 215 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో 116 పరగులు చేశాడు. రెండో వికెట్‌కు దూబే, శర్మ 222 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బరిలోకి రాజత్ పటిదార్‌తో కలిసి యశ్ దూబే జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దూబే 133 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ములానీ బౌలింగ్‌లో ఓ బంతిని బౌండరీకి తరలించే యత్నంలో కీపర్ టామోరేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆదిత్య శ్రీవాత్సవతో కలిసి రాజత్ పాటిదార్ జట్టు ఇన్నింగ్స్ చక్కదిద్దుతూ అర్దసెంచరీని పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 368 పరుగులు చేసింది. ఇంకా 6 పరుగులు వెనకబడింది. ప్రస్తుతం రాజత్ పాటిదార్ 67, ఆదిత్య శ్రీవాత్సవ 11 పరగులతో క్రీజులో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.