Thursday, November 21, 2024

సరదా కోసం యువతులు శారీరక సంబంధాలు పెట్టుకోరు: మధ్యప్రదేశ్ హైకోర్టు

మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉజ్జయినికి చెందిన యువకుడు పెళ్లి పేరుతో ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే అనంతరం అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వివాదం మొదలైంది. ఈ తతంగం 2018లో జరిగింది. అయితే శారీరక సంబంధం పెట్టుకున్న యువతి, యువకుడు వేర్వేరు మతాలకు చెందినవాళ్లు. తమ ఇంట్లో పెద్దవాళ్లు ప్రేమకు ఒప్పుకోవడంలేదని, అందుకే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు చెప్పడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొంది ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఈ నేపథ్యంలో ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించి, యువకుడిపై అత్యాచార కేసు నమోదు చేశారు. యువకుడు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ కేసును విచారించింది. ఆ అమ్మాయి మేజర్ అని, ఆమె ఇష్టంతోనే తన క్లయింటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని యువకుడి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సుబోధ్ అభయంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఎవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని స్పష్టం చేశారు. సంప్రదాయాలకు విలువ ఇచ్చే మన సమాజంలో అవివాహిత యువతులు ఇంత దిగజారే స్థితికి ఇంకా చేరుకోలేదని జస్టిస్ సుబోధ్ వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటామనే బలమైన హామీపైన తప్పించి, ఇతరత్రా కారణాలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వారికేమీ సరదా కాదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ నిజాయతీ నిరూపించుకోవడానికి బాధితులు బలవన్మరణాలకు ప్రయత్నించాల్సిన అవసరంలేదన్నారు. అంతేకాకుండా శారీరక సంబంధాల పర్యవసానాలను కూడా పురుషులు దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. కాగా నిందితుడికి బెయిల్ నిరాకరిస్తున్నట్టు జస్టిస్ సుబోధ్ అభయంకర్ స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: బర్రెపై అత్యాచారం చేసిన వ్యక్తి.. అంతలోనే మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement