మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్ధాలోని బైరాఘర్‌లో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. ముందుగా ఐదుగురు మృతిచెందగా, ఆ సంఖ్య 11కు పెరిగింది. ఫ్యాక్టరీలో అందరూ పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా… ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరుకుంది. మరో 60 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి సమీపంలో 60 ఇళ్లు పూర్తిగా దగద్ధమయ్యాయి. మరికొన్ని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. భారీ పేలుళ్ల కారణంగా పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ సందర్భంగా హార్దా కలెక్టర్ రిషి గార్గ్ మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఇప్పటి వరకు మొత్తం 11 మంది మృతి చెందినట్లుగా నిర్ధారించామని తెలిపారు. అదేవిధంగా 60 మందికి పైగా గాయపడినట్లుగా తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమించడంతో మరికొందరిని మెరుగైన చికిత్స కోసం భోపాల్, ఇండోర్‌కు తరలించామని తెలిపారు.