మేడారం మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు వస్తారు. జాతరకు నెల పదిహేను రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నది. జాతర అభివృద్ది పనుల్లో అలసత్వం చేయకుండా జాతర పనులను ముమ్మరం చేయాలని రాష్ట్రదేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఏదేమైన జనవరి 15 కల్లా జాతర పనులు పూర్తికావాలని మంత్రులు సూచించారు. మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ది పనులను మంత్రులు, స్థానిక శాసన సభ్యురాలు సీతక్క, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి పరిశీలించారు. జాతర పరిసాంల మొత్తం కలియదిరిగారు. జంపన్నవాగులో జరుగుతున్నటువంటి అభివృద్ది పనులను పరిశీలించడంతో పాటు వాగులో ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని స్వయంగా మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క దిగి పరిశీలించారు. అనంతరం మేడారంలోని క్యాంపు కార్యాలయంలో జాతర అభివృద్ది పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు.
జాతరకు ఇప్పటి నుంచే భక్తుల తాకిడి పెరిగింది. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో వేలసంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ముందే వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. జాతరకు వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ పనులపై దృష్టి సారించడంతో పాటు గత జాతరలో ఎదురైనటువంటి సమస్యలను గుర్తించి వాటిని అదిగమించే విధంగా చర్యలు చేపట్టాలని అధి కారులను మంత్రులు ఆదేశించారు. గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు క ల్పించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ప్రధానంగా జాతరలో తాగునీటి, పారిశుద్ద్యం, వసతి, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, బారికెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
దేశమంతటా కోవిడ్, ఓమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. జాతరకు వచ్చేటటువంటి భక్తులకు కరోనా సోకకుండా భక్తులు కోవి డ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తల్లులను దర్శనాలు జరిగే విధంగా చూడాలన్నారు. మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారనే అంచనా ఉన్నప్పటికి లక్షల సంఖ్యలో భక్తులు గుమికూడటం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని ఈసందర్బంగా వైద్యఆరోగ్యశాఖ, దేవాదాయ శాఖ అధికారులకు, పోలీసులకు మంత్రులు సూచించారు. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే కొంత కరోనా సమస్య నుంచి బయటపడగలుగుతామన్నారు.
కరోనా నేపథ్యంలో భక్తులు సామాజిక దూరాన్ని పాటించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్యూలైన్లను పెంచాలని మంత్రులు దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అంతకు ముందు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సమీక్షా కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కలెక్ట ర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital