ఏపీలో సంచలనం రేపిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులు విశాఖ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పోలీసుల భారీ భద్రత మధ్య నిందితులు ఇద్దర్ని చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లారు. పురుషోత్తం నాయుడు, పద్మజలు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.
జనవరి 24న పూజల పేరుతో పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులు.. తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయి దివ్యను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. అయితే, రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలు భయపడిపోయారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు. పద్మజ ఉంటున్న బ్యారక్‌లో మహిళా ఖైదీలు రాత్రిళ్లు నిద్రించాలంటే భయపడ్డారు. ఇక పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి ఏడ్చారు. దీంతో జైలు సిబ్బంది అధికారులతో మాట్లాడి తిరుపతి రుయాకు తరలించారు.
మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్ చేశారు. దీంతో నిందితులు పురుషోత్తం, పద్మజ.. ఇద్దర్ని విశాఖ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఇద్దరు కోలుకోవడంతో సోమవారం డిశ్చార్ చేశారు. దీంతో విశాఖ నుంచి మదనపల్లి సబ్‌జైలుకు తరలించారు. కాగా, మానసిక పరిస్థితి మెరుగు పడడంతో పురుషోత్తం నాయుడు, పద్మజ పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.