పకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దాం
రసాయనాల వినియోగం అనర్థం
సేద్యంపై పిల్లల్లో అవగాహన పెంచుదాం
కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
( ఆంధ్రప్రభ స్మార్ట్, మచిలీపట్నం ప్రతినిధి) – బాల్యం నుంచి విద్యార్థులకు ప్రకృతి సేద్యం పట్ల అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.జిల్లాలో పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ విధానం అమలు గురించి శుక్రవారం ఉయ్యూరు విశ్వశాంతి విద్యాలయంలో నిర్వహించిన కార్యశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ జిల్లాలో 100 పాఠశాలల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు, ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించేందుకు గురువారం మచిలీపట్నంలో, ఈరోజు ఉయ్యూరులో కార్యశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రసాయన ఎరువులే అనర్థం
వ్యవసాయ ఆధారిత కృష్ణా జిల్లాలో రైతులు తాము పండిస్తున్న పంటలకు సరైన ఆదాయం పొందలేక, రసాయనిక ఎరువులు వాడకం అధికమై భూసారం తగ్గడం వలన దిగుబడులు సరిగా పొందలేక రైతులు నష్టపోతున్నారని, తద్వారా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించక వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితులలో రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టడం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవ ఎరువులు వాడకం వలన భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ విధానాలపై విద్యార్థులకు చిన్నతనం నుంచి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు
ప్రకృతి సేద్యంతో ఎంతో మేలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం వైపు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయంపై చిన్నతనం నుండి పిల్లలకు తెలియజేయాలనే సత్సంకల్పంతో పాఠశాల స్థాయి నుండి పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పిల్లలకు అవగాహన పెంచి సొంతూరుకు వెళ్లినప్పుడు తమ గ్రామాల్లో నెమ్మదిగా మార్పు తీసుకు వస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో రైతు సాధికార సంస్థల పరిధిలోని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
చిన్నతనం నుండి పిల్లలకు విత్తన శుద్ధి, ఘన, ద్రవ, బీజామృతాలు అంటే ఏమిటి వాటి వలన మొక్కలు ఎంత బాగా పెరుగుతాయనే విషయం పైన విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు. ఖాళీ పిరియడ్లలో విద్యార్థులకు ఈ కార్యక్రమం పైన సంపూర్ణ అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని భారంగా భావించక, ఇదొక మంచి అవకాశంగా, బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.జిల్లాలో మోపిదేవి జడ్పీ పాఠశాలలో ప్రకృతి సేద్యంతో పెరటి తోటల పెంపకం చేపట్టి సక్సెస్ అయ్యారని, ప్రధానోపాధ్యాయురాలు తమ అనుభవాలు కార్యశాలలో వివరించాలని సూచించారు.వ్యవసాయ శాఖ ఏడి పార్థసారథి ప్రకృతి సేధ్యంపై అవగాహన కల్పించారు.