మన దేశంలో యాపిల్ ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిని మన దేశంలో కంపెనీ పెంచేందుకు చర్యలు తీసుకుంది. చైనాలో కొవిడ్ సమస్యతో ఉత్పత్తి తగ్గడంతో ఈ మేరకు కంపెనీ భారత్‌లో తయారీని పెంచింది. ఇదే దారిలో యాపిల్ కంపెనీ మ్యాక్‌బుక్ తయారీ కూడా మన దేశంలో ప్రారంబించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఐటీ శాఖలో ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. మ్యాక్ బుక్, ఐ ప్యాడ్స్ తయారీకి మన దేశంలో అమల్లో ఉన్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక స్కీమ్ (పీఎల్‌ఐ) అమలు చేయనున్నారు.
ప్రస్తుతం ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు పెంచేందుకు ప్రభుత్వం 7,350 కోట్లతో పీఎల్‌ఐ స్కీమ్ అమలు చేస్తోంది. అయితే ఈ స్కీమ్ పట్ల కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ సారి బడ్జెట్‌లో దీన్ని 20 వేల కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఐ ఫోన్ల ఉత్పత్తిని విజయవంతంగా చేస్తున్నామని, తరువాత దశలో మ్యాక్‌బుక్, ఐ ప్యాడ్ ఉత్పత్తి కూడా మనదేశంలో జరిగేలా కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐటీ శాఖ అధికారి తెలిపారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే, మన దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.